Loading...
UPI Charges Explained: ఫోన్ కొంటే.. పెట్రోల్ పోయిస్తే.. యూపీఐ ఛార్జీలు చెల్లించాలా..?
ఫోన్ కొంటే.. పెట్రోల్ పోయిస్తే.. యూపీఐ ఛార్జీలు చెల్లించాలా..?

UPI Charges Explained: ఫోన్ కొంటే.. పెట్రోల్ పోయిస్తే.. యూపీఐ ఛార్జీలు చెల్లించాలా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

నగదు రహిత చెల్లింపుల్లో అత్యంత కీలకంగా మారిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలపై ఛార్జీలకు సంబంధించి కేంద్రం చేసిన ప్రకటన వినియోగదారుల్లో అయోమయం కలిగిస్తోంది. రూ.2,000కు మించిన కొన్ని యూపీఐ లావాదేవీలపై రుసుములు వర్తిస్తాయని కేంద్రం వెల్లడించింది. అయితే, ఈ ఛార్జీలు వినియోగదారులకు కాకుండా వ్యాపార సంస్థలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయినప్పటికీ, వ్యాపారులు ఆ భారాన్ని చివరకు కస్టమర్లపైనే మోపుతారేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ యూపీఐ ఛార్జీలు ఎలా లెక్కిస్తారు? ఎవరు చెల్లించాలి? వివిధ ఉదాహరణలతో తెలుసుకుందాం.

వివరాలు 

ఫోన్ కొనుగోలు చేస్తే..

మీరు రూ.50,000 విలువైన ఫోన్‌ను కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించారని అనుకుందాం.

కేంద్రం ప్రకటించిన 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ప్రకారం.. ఈ లావాదేవీపై రూ.200 ఛార్జీ వర్తిస్తుంది.

అయితే, ఈ మొత్తాన్ని కస్టమర్ చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ఆ రుసుమును ఫోన్ విక్రేత నుంచి వసూలు చేస్తారు.

వివరాలు 

పెట్రోల్ పోయించుకుంటే..

మీ కారులో రూ.3,000 విలువైన పెట్రోల్ పోయించుకుని, యూపీఐ ద్వారా చెల్లించారనుకోండి.

అప్పుడు మీరు పెట్రోల్‌కు చెల్లించాల్సిన రూ.3,000 మాత్రమే చెల్లిస్తారు. కస్టమర్‌గా మీపై ఎలాంటి అదనపు రుసుము ఉండదు.

అయితే, మీరే పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నట్లయితే.. ఆ లావాదేవీపై రూ.5 స్థిర MDR ఛార్జీ వర్తిస్తుంది. దాన్ని వ్యాపార సంస్థగా మీరు చెల్లించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఎలా ఉంటాయి?

బీమా ప్రీమియం చెల్లింపులు, పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోళ్లు, ప్రభుత్వ విద్యుత్, నీరు, పైప్‌డ్ గ్యాస్ బిల్లులు, పాఠశాలలు, కళాశాలల ట్యూషన్ ఫీజులు వంటి నిర్దిష్ట చెల్లింపుల్లో రూ.2,000కు మించిన లావాదేవీలపై శాతం ఆధారంగా కాకుండా రూ.5 స్థిర MDR మాత్రమే వర్తిస్తుంది.

రెస్టారంట్‌లో భోజనం చేస్తే..

మీరు రెస్టారంట్‌లో భోజనం చేసి, రూ.5,000 బిల్లు చెల్లించారని అనుకుందాం. ఆ మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించినా.. మీరు అదనంగా ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 0.4 శాతం MDR ప్రకారం లెక్కిస్తే వచ్చే రూ.20 ఛార్జీని సంబంధిత రెస్టారంట్‌నే భరిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు 

స్నేహితుడికి డబ్బు పంపితే..

అత్యవసర పరిస్థితిలో మీ స్నేహితుడికి రూ.50,000 యూపీఐ ద్వారా పంపించారనుకుందాం.

ఇలాంటి వ్యక్తిగత బదిలీలపై (Person-to-Person) ఎలాంటి MDR ఛార్జీ ఉండదు.

మీరు పంపిన వ్యక్తిగత మొత్తంపై మీకుగానీ, డబ్బు అందుకున్న స్నేహితుడికిగానీ ఎలాంటి రుసుము విధించరు.

ఎంత పెద్ద మొత్తాన్ని పంపినా వ్యక్తిగత యూపీఐ బదిలీలకు ఛార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది.

వివరాలు 

యూపీఐ ద్వారా రూ.లక్ష చెల్లిస్తే..

ఏదైనా వ్యాపార సంస్థకు రూ.1,00,000 మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించారని అనుకుందాం.

0.4 శాతం MDR ప్రకారం చూస్తే.. ఈ లావాదేవీపై రూ.400 ఛార్జీ రావాలి.

అయితే, రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై ఒక్కో చెల్లింపుకు గరిష్ఠంగా రూ.300 మాత్రమే MDRగా వసూలు చేయాలని కేంద్రం పరిమితి విధించింది.

అందువల్ల రూ.1 లక్ష చెల్లింపుపై కూడా బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు వ్యాపార సంస్థ నుంచి రూ.300కు మించి వసూలు చేయలేరు.

వివరాలు 

కస్టమర్లపై భారం పడుతుందా?

MDR ఛార్జీలను వ్యాపారులు తమ కస్టమర్లకు బదిలీ చేయకుండా చూడాలని కేంద్రం బ్యాంకులను సూచించింది.

అంతేకాదు, యూపీఐ అప్లికేషన్ ప్రొవైడర్లు వినియోగదారులపై ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదా అంతర్గత ఛార్జీలు విధించడంపై నిషేధం ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

అయితే, ఈ నిబంధనలు ఆచరణలో ఎంతవరకు అమలవుతాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

ఇప్పటికే కొన్ని మర్చంట్‌ అవుట్‌లెట్ల వద్ద క్రెడిట్‌ కార్డు చెల్లింపులకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తారంటూ బోర్డులు కనిపిస్తున్నాయి.

వివరాలు 

కస్టమర్లపై భారం పడుతుందా?

కొన్ని వ్యాపార సంస్థలు క్రెడిట్‌ కార్డులతో చెల్లించే కస్టమర్ల నుంచి అదనపు మొత్తాన్ని తీసుకుంటున్నాయి.

ఇదే తరహాలో యూపీఐ MDR ఛార్జీలు అమల్లోకి వస్తే.. వ్యాపారులు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతారేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, ఈ ఛార్జీల కారణంగా వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల కంటే మళ్లీ నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT