General Motors Layoffs: 1,000 మంది ఉద్యోగులకు బదులు 50 రోబోలు..
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్ సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. వివిధ రంగాల్లో ఆటోమేషన్ వేగంగా పెరుగుతుండటంతో అనేక కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించి సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ (జీఎం) వెయ్యికిపైగా ఉద్యోగులను తొలగించి, వారి స్థానాల్లో రోబోలను ప్రవేశపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
అసెంబ్లీ పనుల్లో కోబోట్స్
మిషిగన్‌లోని తమ ప్రధాన కార్యకలాపాల కేంద్రంలో జనరల్ మోటార్స్ 'కోలాబరేటివ్ రోబోట్స్' (కోబోట్స్)ను విధుల్లోకి తీసుకొచ్చింది. వాహనాల తయారీ, అసెంబ్లీ ప్రక్రియల్లో ఈ కోబోట్స్ మానవ ఉద్యోగులతో కలిసి పనిచేస్తున్నాయి. సంస్థ కార్యకలాపాల్లో ఆధునిక సాంకేతికతను మరింత విస్తరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధి కెవిన్ కెల్లీ తెలిపారు. అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, మార్కెట్ పోటీలో ముందంజలో నిలవడం కోసం రోబోటిక్ వ్యవస్థలను వినియోగిస్తున్నామని ఆయన వివరించారు.
వివరాలు
ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళన
అయితే కంపెనీ చర్యపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగాల స్థానంలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మరింత తగ్గే ప్రమాదం ఉందని ట్రేడ్ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. ''వెయ్యి మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. ఇప్పుడు వారి స్థానాల్లో రోబోలు పనిచేస్తున్నాయి. ఇదే విధానం కొనసాగితే సాధారణ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు దొరకడం మరింత కష్టమవుతుంది'' అని యూనియన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
పెరుగుతున్న ఆటోమేషన్ ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఏఐ, రోబోటిక్స్ ఆధారిత వ్యవస్థలను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఉత్పాదకత పెంపు, వ్యయ నియంత్రణ వంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మానవ ఉద్యోగాలపై వాటి ప్రభావం ఎంత మేర ఉంటుందన్న అంశంపై చర్చ కొనసాగుతోంది. జనరల్ మోటార్స్ తాజా నిర్ణయం కూడా ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది.