GIFT Nifty: అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా గిఫ్ట్ నిఫ్టీ ట్రేడింగ్ వేళల్లో మార్పు
ఈ వార్తాకథనం ఏంటి
గిఫ్ట్ సిటీలోని ఎన్‌ఎస్‌ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈఐఎక్స్) గిఫ్ట్ నిఫ్టీగా పేరొందిన ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ వేళలను పొడిగించింది. నవంబర్ 2 నుంచి కొత్త సమయాలు అమల్లోకి వచ్చాయి. ఉదయం సెషన్ ఇకపై ఉదయం 5:15 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెషన్ వేళల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
వివరాలు
గిఫ్ట్ నిఫ్టీ కొత్త ట్రేడింగ్ వేళలు
కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రీ-ఓపెన్ సెషన్ ప్రారంభమవుతుంది.
సాధారణ ట్రేడింగ్ ఉదయం 5:15 గంటల నుంచి మధ్యాహ్నం 3:40 గంటల వరకు కొనసాగుతుంది.
ఆ తర్వాత ప్రీ-క్లోజ్ సెషన్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:50 గంటలకు ఆర్డర్ల స్వీకరణ ముగుస్తుంది.
3:55 గంటలకు సెషన్ పూర్తవుతుంది. రెండో సెషన్ వేళల్లో మార్పు లేదు.
మధ్యాహ్నం 3:58 గంటలకు ప్రీ-ఓపెన్ సెషన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సాధారణ ట్రేడింగ్ మరుసటి రోజు తెల్లవారుజామున 2:45 గంటల వరకు కొనసాగుతుంది.
వివరాలు
దాదాపు రోజంతా ట్రేడింగ్ అవకాశం
ఎన్‌ఎస్‌ఈఐఎక్స్ దాదాపు రోజంతా ట్రేడింగ్ చేసే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీంతో ట్రేడింగ్ వేళలు తెల్లవారుజామున 3:15 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2:45 గంటల వరకు ఉంటాయి.
ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్ల ట్రేడింగ్ వేళలకు అనుగుణంగా ఈ సమయాలను రూపొందించారు.
అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ట్రేడింగ్ సంస్థలు ప్రపంచ మార్కెట్లలో చోటుచేసుకునే పరిణామాలకు అనుగుణంగా త్వరగా స్పందించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది.
వేర్వేరు టైమ్ జోన్లలో మార్కెట్లను పర్యవేక్షిస్తూ తమ పెట్టుబడులపై రిస్క్‌ను నిర్వహించుకునేందుకు మరింత వెసులుబాటు కలగనుంది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లతో గిఫ్ట్ సిటీ అనుసంధానం బలోపేతం: బాలసుబ్రహ్మణ్యం
23.5 గంటల పాటు ట్రేడింగ్ సౌకర్యం కల్పించడం గిఫ్ట్ సిటీని అంతర్జాతీయ మార్కెట్‌గా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో కీలక ముందడుగు అని ఎన్‌ఎస్‌ఈఐఎక్స్ ఎండీ, సీఈఓ వి. బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
అన్ని టైమ్ జోన్లలో మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ట్రేడింగ్ సంస్థలకు మరింత వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు.
గిఫ్ట్ సిటీకి ప్రపంచ ఆర్థిక మార్కెట్లతో అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.