యూఏడబ్ల్యూ సమ్మె.. మరో 200 మంది ఉద్యోగులను తొలగించిన జనరల్ మోటార్స్
అమెరికాకు చెందిన బహుళజాతి ఆటోమోటివ్ తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (GM) కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన యునైటెడ్ ఆటో వర్కర్స్ (UAW) ప్రస్తుతం సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనరల్ మోటార్స్ (GM) తమ కంపెనీలోని మరో 200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ నుంచి తొలగించిన మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,300కి చేరుకుందని రాయిటర్స్ నివేదించింది. ఇప్పటి వరకు లాన్సింగ్, మిచిగాన్, టోలెడో, ఒహియో సహా ఆరు ప్లాంట్‌లోని ఉద్యోగులపై లే ఆఫ్ ప్రభావం పడింది. ఒక వైపు యాజమాన్యం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నా, కార్మికులు మాత్రం భయపడం లేదు. సమ్మెను విరమించే వరకు ఉద్యోగులను విధుల్లోకి రానివ్వమని జీఎం పేర్కొంది.
తగ్గిన 946 మిలియన్ డాలర్ల ఆదాయం
ఆటోమోటివ్ పరిశ్రమలో కార్మికులు 23% వేతన పెంపును డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై జీఎం-యూఏడబ్ల్యూ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో పురగోతి కూడా కనిపించింది. నిర్దిష్ట సమయానికి కంపెనీ నుంచి తమకు సానుకూలంగా ప్రకటన వస్తుందని నమ్ముతున్నట్లు యూఏడబ్ల్యూ ప్రెసిడెంట్ షాన్ ఫైన్ తెలిపారు. సమ్మె కారణంగా జీఎం, ఫోర్డ్, స్టెల్లాంటిస్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. జీఎంలో 34,176 వాహనాలు, ఫోర్డ్‌లో 21,296 వాహనాలు, స్టెల్లాంటిస్‌లో 18,893 వాహనాల ఉత్పత్తి నిలిచిపోయినట్లు డ్యుయిష్ బ్యాంక్ నివేదించింది. దీని ఫలితంగా ఇప్పటివరకు ఈ కంపెనీలకు 946 మిలియన్ డాలర్ల ఆదాయం తగ్గిపోయింది. సమ్మె ప్రభావం మూడో వారం చివరి నాటికి మొత్తం 5.5 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఆండర్సన్ ఎకనామిక్ గ్రూప్ చెబుతోంది.