LOADING...
TG News: కృష్ణా నీటి లెక్కల్లో అవకతవకలు.. బోర్డుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం
కృష్ణా నీటి లెక్కల్లో అవకతవకలు.. బోర్డుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం

TG News: కృష్ణా నీటి లెక్కల్లో అవకతవకలు.. బోర్డుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2026
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

నీటి వినియోగానికి సంబంధించిన లెక్కల్లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వాస్తవాలకు విరుద్ధంగా గణాంకాలు నమోదు చేసిందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 6వ తేదీన ఏపీ ఈఎన్సీకి బోర్డు పంపిన లేఖలో పేర్కొన్న నీటి వినియోగ వివరాలు సరికాదని గుర్తించినట్లు చెబుతూ, తాజాగా కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణా జలాల వినియోగంపై తమ వద్ద నమోదైన లెక్కలు, అభ్యంతరాలను తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఓవీ రమేష్‌ బాబు ఆ లేఖలో వివరించారు.

వివరాలు 

ఏపీ వినియోగంలో 112.84 టీఎంసీలు, తెలంగాణకు సంబంధించి 20.61 టీఎంసీల తేడా

జనవరి 31 నాటికి ఏపీ 555.50 టీఎంసీలు, తెలంగాణ 156.03 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్లు బోర్డు పేర్కొనగా, తమ వద్ద ఉన్న సమాచార ప్రకారం మాత్రం ఏపీ 668.34 టీఎంసీలు, తెలంగాణ 176.64 టీఎంసీలను ఉపయోగించుకున్నట్లు తేలిందని లేఖలో తెలిపారు. బోర్డు చూపిన లెక్కలతో పోలిస్తే ఏపీ వినియోగంలో 112.84 టీఎంసీలు, తెలంగాణకు సంబంధించి 20.61 టీఎంసీల తేడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏపీ కృష్ణా డెల్టా వ్యవస్థ, గుంటూరు ఛానల్, కేసీ కెనాల్, సుంకేశుల బ్యారేజీ పరిధిలో, అలాగే తెలంగాణ జూరాల ప్రాజెక్టు కింద వినియోగించిన నీటిని బోర్డు తక్కువగా నమోదు చేసిందని ఆరోపించారు. అంతేకాదు, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా ఏపీ వినియోగించిన నీటి వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లోనే నమోదు చేయలేదని తెలిపారు.

వివరాలు 

ప్రాజెక్టుల ఔట్‌లెట్లను బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి ఏపీ తన కోటాను మించి నీటిని తరలిస్తున్నప్పటికీ బోర్డు ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ పేర్కొంది. నీటి సంవత్సరంలో ఇప్పటికే ఎనిమిది నెలలు గడిచినా, ఏపీ తమ నీటి వినియోగ వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో వెల్లడించలేదని, తెలంగాణ పదేపదే దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శించింది. ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన నీటి తరలింపును కట్టడి చేయాలని, లేదంటే ప్రాజెక్టుల ఔట్‌లెట్లను బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ నెల 13 నాటికి తెలంగాణ 190.39 టీఎంసీలు (21.67 శాతం), ఏపీ 688.28 టీఎంసీలు (78.33 శాతం) నీటిని వినియోగించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

మొత్తం 878.67 టీఎంసీలను ఉపయోగించిన రెండు రాష్ట్రాలు

రెండు రాష్ట్రాలు కలిపి ఈ నీటి సంవత్సరంలో మొత్తం 878.67 టీఎంసీలను ఉపయోగించుకున్నాయని తెలిపారు. రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల తాత్కాలిక ఒప్పందం ప్రకారం 34:66 నిష్పత్తిలో తెలంగాణకు ఇంకా 164.47 టీఎంసీల కోటా మిగిలి ఉండగా, ఏపీ మాత్రం తన కోటాను మించి 20.17 టీఎంసీలను అదనంగా వినియోగించుకుందని పేర్కొన్నారు. కోటా మేరకు తెలంగాణ అవసరాలకు తగినంత నీటిని వెంటనే కేటాయించాలని, వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా తక్షణమే త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది.

Advertisement