LOADING...
Polavaram: కొత్త డయాఫ్రం వాల్‌ నాణ్యతపై విదేశీ నిపుణుల ప్రశంసలు.. పరీక్షల్లో అన్ని ప్రమాణాలు పూర్తి
పోలవరం పనులకు గ్రీన్‌ సిగ్నల్‌.. డయాఫ్రం వాల్‌ నాణ్యత భేష్

Polavaram: కొత్త డయాఫ్రం వాల్‌ నాణ్యతపై విదేశీ నిపుణుల ప్రశంసలు.. పరీక్షల్లో అన్ని ప్రమాణాలు పూర్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం ప్రాజెక్టులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త డయాఫ్రం వాల్‌ నాణ్యత అత్యుత్తమంగా ఉందని విదేశీ నిపుణుల బృందం తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన అన్ని నాణ్యత పరీక్షలు నిర్దేశించిన ప్రమాణాలను చేరుకున్నాయని, కొన్ని పరీక్షల్లో ఫలితాలు ప్రమాణాల కంటే మెరుగ్గా నమోదయ్యాయని పేర్కొంది. డయాఫ్రం వాల్‌ను నిర్మించిన బావర్‌ సంస్థ అందించిన కట్టర్‌ ఇంక్లినేషన్‌ సిస్టమ్‌ (CIS) డేటాను ఆధారంగా తీసుకుని రూపొందించిన త్రిమితీయ (3డీ) నమూనాను పరిశీలించగా, ప్యానెళ్ల మధ్య అనుసంధానం సహా అన్ని అంశాలు నిర్దేశిత పరిమితుల్లోనే ఉన్నట్లు నిర్ధారించినట్లు నివేదికలో వెల్లడించింది.

వివరాలు 

365 ప్యానెళ్లతో నిర్మాణం పూర్తి

ఇప్పటికే ఆరు విడతల్లో పోలవరం పనులను పరిశీలించిన విదేశీ నిపుణుల బృందంలోని సభ్యుడు హించ్‌బెర్గర్‌ ఈ ఏడాది మే నెలలో మరోసారి మూడు రోజుల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి పనులను సమీక్షించారు. అనంతరం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలసంఘం నిపుణులతో సమావేశమై పరిశీలనలు, నాణ్యత పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రాథమిక నివేదిక సమర్పించారు. తుది నివేదిక ఇంకా రావాల్సి ఉంది. కొత్త డయాఫ్రం వాల్‌ను మొత్తం 1,372.6 మీటర్ల పొడవున 365 ప్యానెళ్లతో నిర్మించారు. ప్యానెళ్ల సగటు లోతు 51 మీటర్లు కాగా, గరిష్ఠ లోతు 97.6 మీటర్లుగా నమోదైంది. నిర్మాణ పనులు 2025 జనవరి 18న ప్రారంభమై 2026 ఏప్రిల్‌ 2 నాటికి పూర్తయ్యాయి.

వివరాలు 

వేల సంఖ్యలో నాణ్యత పరీక్షలు

డయాఫ్రం వాల్‌ నిర్మాణ నాణ్యతను నిర్ధారించేందుకు మొత్తం 7,311 యూసీఎస్‌, సీసీఎస్‌ పరీక్షలు నిర్వహించారు. యూసీఎస్‌ పరీక్ష ద్వారా గోడపై పై నుంచి పడే భారీ మట్టి, నీటి ఒత్తిడిని ఎంతవరకు తట్టుకోగలదో అంచనా వేస్తారు. సీసీఎస్‌ పరీక్షలో నాలుగు వైపుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. అదనంగా 841 పర్మెబిలిటీ పరీక్షలు నిర్వహించి గోడ నీటిని ఎంత సమర్థంగా అడ్డుకుంటుందో పరీక్షించారు. అలాగే 23,607 స్లంప్‌ పరీక్షల ద్వారా కాంక్రీటు నాణ్యతను పరిశీలించారు. అన్ని పరీక్షల ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది.

Advertisement

వివరాలు 

38 ప్యానెళ్లలో బ్లీడింగ్‌ సమస్య.. అయినా నాణ్యతపై ప్రభావం లేదు

నిర్మాణ సమయంలో 38 ప్యానెళ్లలో బ్లీడింగ్‌ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ట్రెమీ విధానంలో కాంక్రీటు పోసే వేగాన్ని తగ్గించడం ద్వారా సమస్యను నియంత్రించేందుకు ప్రాజెక్టు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే నిర్మాణ సమయంలో ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌ను మించడంతో దానిని పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాలేదని గుర్తించారు. ఈ ఉష్ణ ప్రభావాన్ని తిరుపతి ఐఐటీలో విశ్లేషించగా, టీ-16 మిశ్రమంపై చేసిన అధ్యయనంలో భద్రతాపరంగా ఎలాంటి సమస్య లేదని తేలింది. బ్లీడింగ్‌ నమోదైన ప్యానెళ్ల నుంచి 200 నుంచి 225 మిల్లీమీటర్ల పొడవున్న 48 కోర్‌ నమూనాలు సేకరించి పరీక్షించగా కూడా ప్రతికూల ఫలితాలు కనిపించలేదు.

Advertisement

వివరాలు 

సా కట్‌ పరిశీలనలో పగుళ్లు, ఖాళీలు లేవు

డయాఫ్రం వాల్‌ పైభాగాన్ని సా కట్‌ చేసి దిగువ కాంక్రీటు నాణ్యతను పరిశీలించారు. సాధారణంగా పైభాగంలో బలహీన కాంక్రీటు ఉండటంతో దానిని తొలగిస్తారు. పరిశీలనలో పగుళ్లు, ఖాళీలు లేదా ఇతర నిర్మాణ లోపాలు ఏవీ గుర్తించలేదని నిపుణులు పేర్కొన్నారు. డయాఫ్రం వాల్‌ బయటి ఉపరితలంపై కొన్నిచోట్ల సాయిల్‌ బెంటోనైట్‌ అంటుకుపోవడంతో మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది. కొన్ని ప్యానెళ్ల జాయింట్లకు కూడా మరమ్మతులు నిర్వహించారు. అయితే తనిఖీ, ఆమోదానికి సంబంధించిన పూర్తి రికార్డులను పరిశీలించలేదని, అవన్నీ భద్రపరిచినట్లు అధికారులు తెలిపారని నివేదికలో పేర్కొన్నారు.

వివరాలు 

రాతిలోకి నిర్దేశిత లోతుకంటే ఎక్కువగా ప్యానెళ్లు

ప్యానెళ్లు రాతిలో ఎంత లోతు వరకు చొప్పించారన్న అంశాన్ని కూడా నిపుణులు పరిశీలించారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ సిరామిక్స్‌ శాస్త్రవేత్తల రికార్డుల ప్రకారం ప్యానెళ్లను సాధారణంగా 3 నుంచి 4 మీటర్ల వరకు, కొన్ని చోట్ల 7 మీటర్ల వరకు రాతిలోకి చొప్పించారు. కనీసం 2 మీటర్లు చొప్పిస్తే సరిపోతుందని విదేశీ నిపుణులు సూచించిన ప్రమాణాలకు అనుగుణంగానే పనులు జరిగినట్లు నివేదిక తెలిపింది.

వివరాలు 

సీఐఎస్‌,ఆటోక్యాడ్‌ డేటాతో పర్యవేక్షణ

నిర్మాణంలో బావర్‌ సంస్థ కట్టర్‌ ఇంక్లినేషన్‌ సిస్టమ్‌ను వినియోగించింది. ప్రతి ప్యానెల్‌కు సంబంధించిన ఆటోక్యాడ్‌ నమూనాలను పరిశీలిస్తూ కట్టర్‌ నిలువుగా సాగుతోందా లేదా పక్కకు మళ్లుతోందా అనే అంశాన్ని నిరంతరం పర్యవేక్షించింది. ఐదు ప్యానెళ్లలో స్వల్ప వ్యత్యాసాలు గుర్తించడంతో వాటిని మళ్లీ తవ్వి ఎం-10 లీన్‌ కాంక్రీటుతో నింపి లోపాలను సరిచేశారు. సీఐఎస్‌ డేటా, ఆటోక్యాడ్‌ విశ్లేషణ ఆధారంగా నిర్మాణ నాణ్యత సంతృప్తికరంగా ఉందని విదేశీ నిపుణుల బృందం అభిప్రాయపడింది. రికార్డుల ప్రకారం ప్లాస్టిక్‌ కాంక్రీటు వినియోగం అంచనాల కంటే 5 నుంచి 6 శాతం ఎక్కువగా నమోదైంది. అయితే ఇది సాధారణ పరిధిలోనే ఉండే వ్యత్యాసమని నిపుణులు స్పష్టం చేశారు.

వివరాలు 

పలు అంశాల్లో మరింత జాగ్రత్తలు అవసరం

ప్రధాన డ్యాం నిర్మాణంలో 16టన్నుల వైబ్రేటరీ రోలర్‌ వినియోగంపై పూర్తిగా ఏకీభవించకపోయినా, ప్రస్తుతం అది సాంకేతిక అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోందని నిపుణులు పేర్కొన్నారు. డ్యాం నిర్మాణంలో ఫిల్టర్లు కాలుష్యానికి గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్యాప్‌-1లో డ్యాం జోన్‌-1ను అవసరానికి మించి నిర్మించి తర్వాత కత్తిరించడం వల్ల సమయం వృథా అవుతోందని అభిప్రాయపడ్డారు. క్వారీలోనే రాళ్లను వడబోసి ప్రమాణాలకు అనుగుణమైనవాటినే నిర్మాణ ప్రాంతానికి తీసుకురావాలని సూచించారు. ఫిల్టర్‌ ప్రాంతంలో ముందుగా పెద్ద రాళ్లు వేసి తర్వాత తొలగించే విధానాన్ని నివారించాలని పేర్కొన్నారు. డయాఫ్రం వాల్‌కు ఆనుకుని వేసే మట్టి నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు తేమ శాతాన్ని పెంచాలని సూచించారు. 2026జనవరితో పోలిస్తే ఈ విషయంలో పురోగతి కనిపించిందని నివేదిక పేర్కొంది.

వివరాలు 

పలు అంశాల్లో మరింత జాగ్రత్తలు అవసరం

జి హిల్‌ ప్రాంతంలోని రెండు షియర్‌ జోన్లలో చేపడుతున్న గ్రౌటింగ్‌ పనులు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, గ్రౌట్‌ మిశ్రమం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మే నెల నాటికి ప్రాజెక్టులో కేవలం మూడు డోజర్లు మాత్రమే పనిచేస్తున్నాయని, వాటి సంఖ్య పెంచాలని సిఫారసు చేశారు. గ్యాప్‌-2 క్లే రీచ్‌లో నిర్మాణ సమయంలో అవసరానికి అనుగుణంగా మార్పులు చేసుకునే ప్రణాళిక సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే గ్యాప్‌-2 ఆనకట్ట నిర్మాణ ప్రాంతానికి వెలుపల మరిన్ని బోర్‌హోల్స్‌ తవ్వి డిజైన్‌ అంచనాలను నిర్ధారించుకోవాలని నివేదికలో పేర్కొన్నారు.

Advertisement