LOADING...
Undavalli: ఉండవల్లిలో అత్యాధునిక హెలిపోర్ట్‌.. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్
ఉండవల్లిలో అత్యాధునిక హెలిపోర్ట్‌.. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్

Undavalli: ఉండవల్లిలో అత్యాధునిక హెలిపోర్ట్‌.. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద అత్యాధునిక హెలిపోర్ట్‌ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలి ఉపగ్రహ ఆధారిత ప్రైవేట్‌ పాయింట్-ఇన్-స్పేస్ ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్ (PinS) విధానంలో హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌)పంపిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా హెలికాప్టర్లు మరింత సురక్షితంగా ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అత్యాధునిక సాంకేతికతను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)అభివృద్ధి చేయగా, దీనికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)అనుమతి కూడా లభించింది. ఉండవల్లి హెలిపోర్ట్‌లో ఒకేసారి కనీసం నాలుగు హెలికాప్టర్లను నిలిపేలా ప్రత్యేక పార్కింగ్ బేలను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు.

వివరాలు 

రూ.5 కోట్ల వరకు వ్యయం

ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.5 కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో హెలిపోర్ట్‌లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఉండవల్లిలో నిర్మించనున్న హెలిపోర్ట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం దక్కనుంది. సాధారణ హెలిప్యాడ్‌లతో పోలిస్తే ఇది పూర్తి స్థాయి హెలిపోర్ట్‌గా అభివృద్ధి కానుంది. విమానాశ్రయాల తరహాలో హెలిపోర్ట్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు ప్రయాణికుల కోసం చిన్న టెర్మినల్ భవనం కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో కేవలం హెలిప్యాడ్‌లు మాత్రమే ఉండగా, ఇక్కడ అదనపు సౌకర్యాలు కల్పించనున్నారు.

వివరాలు 

ఉపగ్రహ సాంకేతికతతో ల్యాండింగ్ ఎలా?

ఈ హెలిపోర్ట్‌లో హెలికాప్టర్‌ ల్యాండింగ్ పూర్తిగా ఉపగ్రహాల నుంచి అందే జీపీఎస్‌ సంకేతాల ఆధారంగా జరుగుతుంది. ప్రస్తుతం సాధారణ హెలిప్యాడ్‌లలో ఉపయోగించే సంప్రదాయ నావిగేషన్ పరికరాల అవసరం ఈ విధానంలో ఉండదు. హెలికాప్టర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ ద్వారా పార్కింగ్ బే లేదా హెలిప్యాడ్ స్థానాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. జీపీఎస్‌ సంకేతాల ఆధారంగా ల్యాండింగ్‌ చేయాల్సిన ఖచ్చితమైన ప్రాంతాన్ని వ్యవస్థ నిర్ధారిస్తుంది. జీపీఎస్‌ మార్గనిర్దేశం ముగిసే స్థానమే హెలిప్యాడ్‌గా గుర్తించబడుతుంది.

Advertisement

వివరాలు 

ప్రతికూల వాతావరణంలోనూ భద్రత

హెలికాప్టర్‌లో అమర్చిన జీపీఎస్‌ ఆధారిత కమ్యూనికేషన్‌, నావిగేషన్‌ వ్యవస్థ వల్ల వెలుతురు తక్కువగా ఉన్నా, దట్టమైన పొగమంచు కమ్ముకున్నా లేదా ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నా సురక్షితంగా ల్యాండింగ్‌ చేయడం సాధ్యమవుతుంది. ఇంకా రాత్రి వేళల్లో ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాట్లు లేకపోయినా హెలికాప్టర్లు సురక్షితంగా దిగేలా ఈ సాంకేతికత సహాయపడుతుంది. సాధారణ హెలిప్యాడ్‌లలో అవసరమయ్యే గ్రౌండ్ ఇన్‌స్ట్రక్టర్లు, భూమిపై ప్రత్యేక మార్గనిర్దేశక సిబ్బంది లేదా ఇతర నావిగేషన్‌ సదుపాయాలు కూడా ఈ విధానంలో అవసరం ఉండదు.

Advertisement

వివారాలు 

ప్రైవేట్ పాయింట్-ఇన్-స్పేస్ విధానం ప్రత్యేకత ఏమిటి?

ప్రైవేట్ పాయింట్-ఇన్-స్పేస్ (PinS) విధానంలో హెలికాప్టర్లకు మార్గనిర్దేశం చేయడానికి పెర్ఫార్మెన్స్‌ బేస్డ్‌ నావిగేషన్ (PBN)తో పాటు ఉపగ్రహ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తారు. దీంతో ప్రస్తుతం హెలిప్యాడ్‌ల వద్ద అవసరమయ్యే అనేక మౌలిక నావిగేషన్ సదుపాయాల అవసరం తగ్గుతుంది. అదే సమయంలో ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్‌ వ్యవస్థ సహాయంతో తక్కువ విజిబిలిటీ ఉన్న ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్‌ అయ్యే అవకాశం కలుగుతుంది. ఈ సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల రాష్ట్రంలో హెలికాప్టర్‌ రవాణా మరింత ఆధునికంగా, సురక్షితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement