LOADING...
Andhra Pradesh: అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీగా ఏపీ చాక్లెట్‌లు
అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీగా ఏపీ చాక్లెట్‌లు

Andhra Pradesh: అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీగా ఏపీ చాక్లెట్‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

కోకో సాగులో ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు చాక్లెట్‌ తయారీ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది. రాష్ట్ర రైతులు, స్థానిక ఉత్పత్తిదారులు నాణ్యమైన చాక్లెట్లను తయారు చేస్తూ దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. బాన్‌ ఫిక్షన్‌,వెస్ట్‌ ఇన్‌,నూయ్‌ చాక్లెట్స్‌,గోదావరి కోకో,చాకో టేల్స్‌, స్లోబీన్‌ అండ్‌ చాక్లెట్స్‌ వంటి పలు బ్రాండ్లు భారతదేశంతో పాటు విదేశాల్లోనూ వినియోగదారుల ఆదరణ పొందుతున్నాయి. నాణ్యత పరంగా అంతర్జాతీయ బ్రాండ్లకు ఏమాత్రం తీసిపోకుండా పోటీ ఇస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకుంటూ స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా హోంమేడ్‌ చాక్లెట్ల తయారీలో అడుగుపెడుతున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా డార్క్‌ చాక్లెట్ల ఉత్పత్తి అధికంగా ఉండగా,వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కనిపిస్తోంది.

వివరాలు 

కోకో సాగులో దేశంలో అగ్రస్థానం

కోకో రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 'బీన్‌ టు బార్‌' విధానాన్ని అమలు చేస్తోంది. కోకో గింజల నుంచి చాక్లెట్‌ తయారీ వరకు పూర్తి విలువ శ్రేణిని రాష్ట్రంలోనే అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కోకో నగరం ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు లక్ష ఎకరాల్లో కోకో సాగు కొనసాగుతోంది. ఏడాదికి 16 వేల నుంచి 18 వేల టన్నుల వరకు కోకో గింజల ఉత్పత్తి నమోదవుతోంది. దేశవ్యాప్తంగా కోకో ఉత్పత్తిలో సుమారు 40 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ ప్రోత్సాహకాలతో రైతులు ఆయిల్‌పామ్‌, కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో సాగును విస్తరించారు.

వివరాలు 

పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద ప్రోత్సాహం

ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో కోకో సాగు అత్యధికంగా జరుగుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలు క్రమంగా చాక్లెట్‌ తయారీ కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఏపీ ఆహార శుద్ధి సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు చాక్లెట్‌ తయారీపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం ద్వారా గత ఏడాది 17 యూనిట్లకు రూ.1.13 కోట్ల రాయితీ మంజూరు చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 16 యూనిట్లకు రూ.1.70 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Advertisement

వివరాలు 

అవార్డులు అందుకుంటున్న బాన్‌ ఫిక్షన్

రాజమహేంద్రవరం కేంద్రంగా గ్రంధి అఖిల్‌ 15 ఎకరాల్లో కోకో సాగు చేస్తూ 'బాన్‌ ఫిక్షన్‌' పేరుతో ప్రీమియం చాక్లెట్లను తయారు చేస్తున్నారు. 2021లో కోకో ఆధారిత ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించిన ఆయన,తొలుత ముంబయి,దిల్లీ,గోవా నగరాల్లో ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాలు చేపట్టారు. అనంతరం అమెరికా మార్కెట్‌లోకి కూడా ప్రవేశించారు. ఈ సంస్థ ప్రస్తుతం 21 రకాల చాక్లెట్‌ బార్‌లను తయారు చేస్తోంది. అకాడమీ ఆఫ్‌ చాక్లెట్స్‌(యూకే) నుంచి స్వర్ణ, రజత, కాంస్య అవార్డులతో పాటు 'కకావో ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌', 'వీగన్‌ చాక్లెట్‌ గోల్డ్‌' (అమెరికా) వంటి అంతర్జాతీయ పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. దేశీయంగా తయారవుతున్న చాక్లెట్లకు వినియోగదారుల ఆదరణ వేగంగా పెరుగుతోందని, త్వరలో యూకే మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టనున్నట్లు గ్రంధి అఖిల్‌ తెలిపారు.

Advertisement

వివరాలు 

రైతు నుంచి చాక్లెట్‌ తయారీదారుగా..

రాజమహేంద్రవరానికి చెందిన కొండపాటి శ్రీనివాసరావు ధవళేశ్వరం ఇండస్ట్రియల్‌ పార్క్‌లో సంవత్సరానికి 450 టన్నుల ప్రాసెసింగ్‌ సామర్థ్యంతో చాక్లెట్‌ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. 20 ఎకరాల్లో కోకో సాగు చేస్తున్న ఆయన తొలుత కోకో గింజలను పలు సంస్థలకు సరఫరా చేసేవారు. అనంతరం 2024లో 'వెస్ట్‌ ఇన్‌' బ్రాండ్‌ పేరుతో ఇంటి స్థాయిలోనే చాక్లెట్ల తయారీ ప్రారంభించి ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ చేపట్టారు. గత ఏడాది పూర్తి స్థాయి చాక్లెట్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి ప్రస్తుతం 50 నుంచి 55 రకాల చాక్లెట్లను ఉత్పత్తి చేస్తున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తుండగా, యూకే, అమెరికా మార్కెట్లలోనూ విక్రయాల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు.

వివరాలు 

రూ.10 లక్షల వరకు రాయితీ

పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద అర్హులైన యూనిట్లకు ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం వరకు, గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు రాయితీ అందిస్తున్నట్లు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. లబ్ధిదారులకు శిక్షణతో పాటు మార్కెట్‌ లింకేజీ కల్పించడం, వివిధ ప్రదర్శనలు, సదస్సుల్లో తమ ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. హోంమేడ్‌ చాక్లెట్ల తయారీలో ముందుకు వస్తున్న మహిళలకు కూడా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement