Lokesh: ఏపీలో 20 వేల స్టార్టప్‌ల లక్ష్యం.. కొరియా సంస్థలకు లోకేశ్ ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌ను స్టార్టప్‌లు, పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) ద్వారా "ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త" అనే నినాదంతో వచ్చే ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లను ఏర్పాటు చేసి, లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. అలాగే ఆర్‌టీఐహెచ్‌ను కేంద్రంగా చేసుకుని భారత్-కొరియా స్టార్టప్ కారిడార్‌ను ఏర్పాటు చేయడానికి దక్షిణ కొరియా సంస్థలను ఆహ్వానించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా రెండో రోజు సోమవారం సియోల్ బిజినెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కొరియన్ టెక్ స్టార్టప్‌లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేశ్ ఈ ప్రతిపాదనలు చేశారు.
వివరాలు
అధునాతన తయారీ రంగాల్లో పెట్టుబడులకు విశేష అవకాశాలు
ఆర్‌టీఐహెచ్‌లోని స్పార్క్ (ఆలోచనల రూపకల్పన), కెటలిస్ట్, వెలాసిటీ ల్యాబ్‌లలో కొరియన్ స్టార్టప్‌లకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా కొరియా డెస్క్, సాఫ్ట్ ల్యాండింగ్ వీసీ బే, కొరియన్ ఏజెన్సీలతో కలిసి సహ-ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా భారత్, దక్షిణ కొరియా స్టార్టప్‌లకు పరస్పర మార్కెట్ అవకాశాలు మరింత విస్తరించనున్నాయని వివరించారు. వెయ్యి కిలోమీటర్లకు పైగా విస్తరించిన ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వెంబడి లాజిస్టిక్స్, ఫిన్‌టెక్, డీప్‌టెక్, ఫ్రాంటియర్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లో పెట్టుబడులకు విశేష అవకాశాలు ఉన్నాయని లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం ద్వారా కొరియన్ డీప్‌టెక్ స్టార్టప్‌ల పరిశోధన, సంయుక్త అభివృద్ధికి అనుకూల వాతావరణం లభిస్తుందని చెప్పారు.
వివరాలు
కొత్త పెట్టుబడులకు ఏపీ అనుకూల గమ్యస్థానం
పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తమ వ్యాపారాలను విస్తరించాలని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సంస్థలను మంత్రి లోకేశ్ కోరారు. ఇప్పటికే కుదిరిన ఒప్పందాల అమలుతో పాటు కొత్త పెట్టుబడులపై కూడా ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) మేరకు దక్షిణ కొరియాకు చెందిన మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ తయారీ సంస్థ షూఆల్స్ కంపెనీ లిమిటెడ్ ఏపీలో పాదరక్షల తయారీ యూనిట్‌ను త్వరగా ప్రారంభించాలని కోరారు. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్, సీఈవో లీ చియాంగ్-జీన్‌తో సమావేశమయ్యారు. రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థ ప్రతిపాదనలో పేర్కొంది.
వివరాలు
కొత్త పెట్టుబడులకు ఏపీ అనుకూల గమ్యస్థానం
అలాగే రాష్ట్రంలోనే పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, ఏపీని రిటైల్,డిస్ట్రిబ్యూషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. శ్రీసిటీలో రూ.338 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్‌ను త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కొరియాకు చెందిన సోలమ్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హాను కోరారు. తిరుపతిలో సీఎస్‌వోటీ (టీసీఎల్)కు డిస్‌ప్లే, అసెంబ్లింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో, ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్‌తో పాటు ఇతర డిస్‌ప్లే ఉత్పత్తుల తయారీని కూడా శ్రీసిటీ యూనిట్‌లో చేపట్టాలని సోలమ్ సంస్థకు ఆహ్వానం పలికారు.
వివరాలు
కొత్త పెట్టుబడులకు ఏపీ అనుకూల గమ్యస్థానం
మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే, మెటీరియల్ హబ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని సాఫ్ట్-ఈపీఐ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఈవో సుంగ్ మిన్ హ్వాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చోతో జరిగిన సమావేశంలో లోకేశ్ ప్రతిపాదించారు. అలాగే తిరుపతి ఐఐటీ సహకారంతో ప్రతి ఏడాది 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే సాఫ్ట్-ఈపీఐ అకాడమీని ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతి, శ్రీసిటీ సమీప ప్రాంతాల్లో స్విచ్‌గేర్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీ, అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ పీయూ సంస్థ అధ్యక్షుడు యొకోటా తకేషిని మంత్రి లోకేశ్ కోరారు.
వివరాలు
కొత్త పెట్టుబడులకు ఏపీ అనుకూల గమ్యస్థానం
రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ, అణు విద్యుత్ ప్రాజెక్టులు, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా 765/800 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు, జీఐఎస్, స్టాట్‌కామ్ వంటి విద్యుత్ పరికరాలకు భారీగా డిమాండ్ ఉండబోతుందని వివరించారు. అలాగే శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీకండక్టర్ సంస్థ డిస్‌ప్లే ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తాయ్‌హ్యుంగ్ లీని కోరారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టే ప్రణాళికలు తమకు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని తాయ్‌హ్యుంగ్ లీ ఈ సందర్భంగా తెలిపారు.