LOADING...
Strait of Hormuz: ఖమేనీ అంత్యక్రియల వేళ హర్మూజ్‌లో ఉద్రిక్తత.. రెండు నౌకలపై ఇరాన్ దాడులు
ఖమేనీ అంత్యక్రియల వేళ హర్మూజ్‌లో ఉద్రిక్తత.. రెండు నౌకలపై ఇరాన్ దాడులు

Strait of Hormuz: ఖమేనీ అంత్యక్రియల వేళ హర్మూజ్‌లో ఉద్రిక్తత.. రెండు నౌకలపై ఇరాన్ దాడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ, హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు. తాజాగా ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలు క్షిపణి దాడికి గురయ్యాయి. ఈ దాడులను ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నిర్వహించినట్లు అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిలో ఒమన్ తీరానికి సమీపంగా ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌లో భారీగా మంటలు చెలరేగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సెంటర్ వెల్లడించింది. ఈ ఘటన వెనుక కూడా ఇరాన్ హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

ట్రంప్ నుంచి మరోసారి హెచ్చరికలు

అయితే ఈ సంఘటన వల్ల సముద్ర పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ రెండు ఘటనల్లో ప్రాణనష్టం జరిగిందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఇరాన్ దివంగత సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర జరుగుతున్న వేళ ఈ వరుస ఘటనలు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం హర్మూజ్ జలసంధిలో రవాణాకు ఎలాంటి అంతరాయం కల్పించబోమని ఇరాన్ హామీ ఇచ్చింది. అయితే ఇటీవల జరిగిన ఘర్షణల సమయంలో తమకు మద్దతుగా నిలిచిన దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని ఇరాన్ ప్రకటించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తికి కారణమైనట్లు తెలుస్తోంది.

వివరాలు 

విద్యుత్ సరఫరాను నిలిపివేయగలం: ట్రంప్ 

ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి కఠిన వ్యాఖ్యలు చేశారు. "అమెరికా ఎప్పుడూ ఒప్పందానికి ప్రాధాన్యం ఇస్తుంది. అయితే అవసరమైతే పని పూర్తిచేయడానికి కూడా వెనుకాడదు. అది అంత కష్టమైన విషయం కాదు కొద్ది గంటల్లోనే వారి వంతెనలను ధ్వంసం చేయగలం. విద్యుత్ సరఫరాను నిలిపివేయగలం. వారి ఆర్థిక పరిస్థితి కూడా బలంగా లేదు. అయినప్పటికీ యుద్ధం వల్ల ఎవరికీ నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే నేను ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తున్నాను" అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

ఖమేనీ అంత్యక్రియల్లో ట్రంప్‌కు వ్యతిరేక నినాదాలు

మరోవైపు ఇరాన్‌లో ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నల్ల దుస్తులు ధరించి అంతిమయాత్రలో పాల్గొన్న పలువురు ప్రజలు పిడికిలి బిగించి ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "మనం మానవత్వాన్ని గౌరవించే వాళ్లం కాబట్టే అంత్యక్రియలు పూర్తయ్యే వరకు విరామం ఇచ్చాం" అంటూ ట్రంప్ మీడియాతో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.

Advertisement