LOADING...
Swayam AP Brand: ఆగస్టు 1 నుంచి మార్కెట్‌లోకి 'స్వయం ఏపీ' బ్రాండ్‌ ఉత్పత్తులు
ఆగస్టు 1 నుంచి మార్కెట్‌లోకి 'స్వయం ఏపీ' బ్రాండ్‌ ఉత్పత్తులు

Swayam AP Brand: ఆగస్టు 1 నుంచి మార్కెట్‌లోకి 'స్వయం ఏపీ' బ్రాండ్‌ ఉత్పత్తులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'స్వయం ఏపీ' బ్రాండ్‌ను ఆగస్టు 1 నుంచి మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు సెర్ప్‌ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసే నాణ్యమైన ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ అవకాశాలు కల్పించడమే ఈ బ్రాండ్‌ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. విజయవాడలోని సెర్ప్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని 26జిల్లాల నుంచి ఆయా ప్రాంతాల ప్రత్యేకత,సంప్రదాయాలను ప్రతిబింబించేలా మొత్తం 65ఉత్పత్తులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ ఉత్పత్తులను రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

వివరాలు 

ప్రతి నెల సామాజిక తనిఖీలు

ఉత్పత్తుల నిల్వ, ఆన్‌లైన్‌,ఇతర ఆర్డర్ల నిర్వహణతో పాటు వేగవంతమైన సరఫరా వ్యవస్థ కోసం విజయవాడలో రెండు ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో ఉత్పత్తుల పంపిణీ మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు మహిళల ఆదాయం కూడా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలు తయారుచేసే ఉత్పత్తులు మార్కెట్‌లో పోటీని తట్టుకునేలా నాణ్యత ప్రమాణాలు పాటించేందుకు అవసరమైన శిక్షణను అందిస్తామని మంత్రి తెలిపారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసే పారిశ్రామిక యూనిట్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి నెల సామాజిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

వివరాలు 

కల్యాణలక్ష్మి త్వరగా ప్రారంభించాలి

డ్వాక్రా సంఘాల్లోని మహిళల పిల్లల వివాహ అవసరాల కోసం తక్కువ వడ్డీతో రుణాలు అందించే కల్యాణలక్ష్మి పథకాన్ని త్వరితగతిన ప్రారంభించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు. అలాగే అవసరమైన స్వయం సహాయక సంఘాలకు ఆధునిక యాంత్రిక పరికరాలతో కూడిన లాండ్రీ యూనిట్లను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంఘాల్లోని ప్రతి సభ్యురాలికి సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాలలో నమోదు పూర్తి చేయాలని కూడా మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సెర్ప్‌ సీఈఓ వాకాటి కరుణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement