Nara Lokesh: ఏపీలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు దక్షిణకొరియా కంపెనీలతో చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు మంత్రి నారా లోకేశ్ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, ఎల్‌జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్, శాంసంగ్, హ్యుందయ్ మోబిస్, అపాక్ట్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో అధునాతన పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు, డేటాసెంటర్లు, సెమీకండక్టర్ రంగాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రతిపాదనలు చేశారు.
వివరాలు
విశాఖలో ఎల్‌జీ ఇంజినీరింగ్ సెంటర్‌కు ఆహ్వానం
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈవో ల్యూ జె చెయాల్,ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్‌లతో మంత్రి లోకేశ్ విడివిడిగా సమావేశమయ్యారు. సంస్థ విస్తరణలో భాగంగా విశాఖపట్టణంలో ఇంజినీరింగ్ సెంటర్ లేదా గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో డిస్‌ప్లే మాడ్యూళ్లు, సెన్సర్లు,పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌తో పాటు వాణిజ్య అవసరాలకు చిల్లర్ తయారీ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. దీనిపై స్పందించిన హాంగ్ జు జియోన్, ఈ ఏడాది చివరినాటికి శ్రీసిటీలో రూ.5,000 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న మూడో యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం చేసిన తాజా ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తామని చెప్పారు.
వివరాలు
కాకినాడ సమీపంలో పాలీస్టెరిన్ తయారీ కేంద్రం ప్రతిపాదన
ఎల్‌జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రతినిధులు, సంస్థ ప్రెసిడెంట్ మరియు ఎల్‌జీ ఓవర్సీస్ హోల్డింగ్స్ హెడ్ యున్-జు కోహ్‌తో జరిగిన సమావేశంలో మంత్రి లోకేశ్ పలు కీలక ప్రతిపాదనలు చేశారు. కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టెరిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మూలపేటలో ప్రపంచస్థాయి నాఫ్తా క్రాకర్ ప్రాజెక్టు, ఎస్‌ఏఎఫ్ బయో ఇథనాల్, జీవ ఇంధనాల తయారీ కేంద్రాల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
వివరాలు
ఏపీలో శాంసంగ్ సిటీ.. డేటాసెంటర్లకు ఆహ్వానం
శాంసంగ్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి లోకేశ్,ఆంధ్రప్రదేశ్‌ను డేటాసెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్‌తో కూడిన పూర్తి స్థాయి ఏఐ-కంప్యూట్ హబ్‌గా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలని కోరారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా శాంసంగ్ సిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ దక్షిణకొరియా సీనియర్ డైరెక్టర్, అపాక్ ఎంఎక్స్ బిజినెస్ హెడ్ హెలెనా పార్క్, బి2బి బిజినెస్ డైరెక్టర్ హీసూ యాంగ్, ఎంటర్‌ప్రైజెస్ బిజినెస్ గ్లోబల్ సేల్స్ హెడ్ వీపీ జున్‌లతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో ఏఐ-రెడీ హైపర్‌స్కేల్ డేటాసెంటర్ల అభివృద్ధి, ఓఎస్‌ఏటీ క్లస్టర్‌ను కేంద్రంగా తీసుకుని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ పరికరాల కోసం ఓఎస్‌ఏటీ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
వివరాలు
హనా మైక్రాన్ సహా సెమీకండక్టర్ సంస్థలకు ఆహ్వానం
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 133 క్యూబిట్ ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్-2 ఆధారంగా పరిశోధనలు నిర్వహించేలా శాంసంగ్ ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే అమరావతిలో శాంసంగ్ హెవీ ఇంజినీరింగ్, దుగరాజపట్నంలో నౌకానిర్మాణ క్లస్టర్ అభివృద్ధికి శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్ నిపుణులను భాగస్వామ్యం చేయాలని ప్రతిపాదించారు. అపాక్ట్ కంపెనీ సీఈఓ సియాంగ్ డాంగ్ లీతో జరిగిన సమావేశంలో హనా మైక్రాన్‌తో పాటు ఇతర ఏఎస్‌ఏటీ (అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్) సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని మంత్రి లోకేశ్ కోరారు. ఏఐఎస్‌పీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో అపాక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సెమీకండక్టర్ రంగానికి అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి కోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని సూచించారు.
వివరాలు
ఈవీ సెమీకండక్టర్ల హబ్‌పై హ్యుందయ్ మోబిస్‌తో చర్చలు
దీనిపై స్పందించిన డాంగ్ లీ, విశాఖపట్నంలో ఏఎస్‌ఐపీ జాయింట్ వెంచర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తామని వెల్లడించారు. హ్యుందయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్, వైస్ ప్రెసిడెంట్ హన్ఫోక్ పార్క్‌లతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ఈవీ సెమీకండక్టర్ల హబ్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని మంత్రి కోరారు. తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపొనెంట్లు, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని, విశాఖపట్నంలో హ్యుందయ్ మోబిస్ ఆర్‌అండ్‌డీ, ఇంజినీరింగ్ కేంద్రాన్ని స్థాపించాలని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని యంగ్ బిన్ కిమ్ తెలిపారు.
వివరాలు
కొరియా సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన మాగోక్ సైన్స్ పార్క్ సందర్శన
సియోల్‌లోని ప్రముఖ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల కేంద్రం మాగోక్ సైన్స్ పార్క్‌ను మంత్రి లోకేశ్ సందర్శించారు. గాంగ్‌సియో-గు ప్రాంతంలో దాదాపు మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చెందిన ఈ పార్క్ దక్షిణకొరియాలో అతిపెద్ద సాంకేతిక ఆవిష్కరణ కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ పార్క్‌లో పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లు, సియోల్ బొటానికల్ పార్క్, ప్రముఖ ఆర్కిటెక్ట్ టడావో ఆండో రూపొందించిన ఎల్‌జీ ఆర్ట్ సెంటర్‌తో పాటు ఎనిమిది ఎల్‌జీ అనుబంధ సంస్థలకు చెందిన సుమారు 20 వేల మంది పరిశోధకులు పనిచేస్తున్నారు.
వివరాలు
కొరియా సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన మాగోక్ సైన్స్ పార్క్ సందర్శన
భాగస్వామ్య సంస్థలు, స్టార్టప్‌లతో కలిసి ఈ పార్క్ కొరియాకు చెందిన సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా రోబో జోన్, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే జోన్, మొబిలిటీ, మెటీరియల్స్ విభాగాలను మంత్రి పరిశీలించారు. అనంతరం సియోల్ బొటానికల్ పార్క్, మాగోక్ కల్చరల్ హాల్, హాన్ నది పార్క్‌ను కూడా సందర్శించారు.