Gold,silver import duty hike: బంగారం, వెండి దిగుమతులపై సుంకం పెంపు.. కేంద్రానికి రూ.10,463 కోట్ల ఆదాయం
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో బంగారం,వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను పెంచడంతో మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య బంగారం,వెండి, ప్లాటినమ్‌పై కస్టమ్స్ డ్యూటీ రూపంలో రూ.10,463 కోట్లు వసూలైనట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు,హర్మూజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఆహారం, ఎరువుల ధరలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో దేశ విదేశీ మారకం నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
వివరాలు
మే 13న బంగారం,వెండిపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి పెంచిన కేంద్రం
వాటిలో విలువైన లోహాల దిగుమతులపై కస్టమ్స్ సుంకాల సవరణ కూడా ఒకటి.
బంగారం, వెండి వంటి విలువైన లోహాల దిగుమతులు, కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రం సుంకాలను పెంచింది.
ఇందులో భాగంగా మే 13న బంగారం,వెండిపై అప్పటివరకు ఉన్న 6 శాతం కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి పెంచింది.
ప్లాటినమ్‌పై కూడా సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచింది. ఈ సుంకాల పెంపు తర్వాత మే 13 నుంచి ఆగస్టు 2 వరకు బంగారంపై రూ.10,040కోట్ల కస్టమ్స్ డ్యూటీ వసూలైంది.
వెండిపై రూ.328 కోట్లు, ప్లాటినమ్‌పై రూ.95 కోట్ల ఆదాయం వచ్చింది.
మొత్తంగా ఈ మూడు లోహాలపై కేంద్రానికి రూ.10,463 కోట్ల ఆదాయం సమకూరిందని మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు.
వివరాలు
దేశంలోకి అక్రమంగా బంగారం తరలించే ప్రయత్నాలపైనా అధికారులు చర్యలు
అయితే సుంకాలను పెంచడం వల్ల అదనంగా ఎంత ఆదాయం వచ్చిందన్న వివరాలను మాత్రం కేంద్రం వెల్లడించలేదు.
మరోవైపు దేశంలోకి అక్రమంగా బంగారం తరలించే ప్రయత్నాలపైనా అధికారులు చర్యలు తీసుకున్నారు.
మే 13 నుంచి జూన్ 30 మధ్య అక్రమ మార్గాల్లో దేశంలోకి తీసుకొస్తున్న 161 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుల్లో 116 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.