Gold & Silver prices: బంగారం,వెండికి మళ్లీ రెక్కలు.. రూ.1.60 లక్షలకు చేరువలో పసిడి ధర
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలహీనపడటం, చమురు ధరలు పెరగడం వంటి అంశాలు విలువైన లోహాలకు డిమాండ్‌ను పెంచాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో కొనుగోళ్లు ఊపందుకోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. దీంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పైపైకి కదిలాయి. హైదరాబాద్‌లో పసిడి ధరకు భారీ పెరుగుదల హైదరాబాద్ మార్కెట్‌లో ఉదయం 10 గంటల సమయంలో 24క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,58,900కు చేరింది. గత ముగింపు ధరతో పోల్చితే పసిడి దాదాపు రూ.4వేల మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.1.60 లక్షల మార్కుకు చేరువైంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా ఎగబాకింది.
వివరాలు
అంతర్జాతీయంగానూ పెరిగిన ధరలు
కిలో వెండి రూ.2,43,200 పలికింది. ఒక్క రోజులోనే కిలో వెండి ధర రూ.6 వేలకుపైగా పెరగడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 4,435.20 డాలర్లకు చేరింది.
అదే సమయంలో ఔన్సు వెండి ధర 67 డాలర్ల వద్ద నమోదైంది. కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లోనూ ఈ రెండు లోహాల ధరలు పెరిగాయి.
గోల్డ్ ఫ్యూచర్స్‌లో 10 గ్రాముల ధర రూ.1.53 లక్షలుగా కొనసాగుతుండగా.. సిల్వర్ ఫ్యూచర్స్‌లో కిలో ధర రూ.2.41 లక్షల వద్ద ఉంది.
వివరాలు
చమురు ధరల పెరుగుదల.. డాలర్ విలువ పతనం
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి.
ఆసియా మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 97 డాలర్లకు చేరింది. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో డాలర్ విలువ బలహీనపడింది.
యూఎస్ డాలర్ సూచీ రెండు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితమని మదుపర్లు భావిస్తున్నారు.
సాధారణంగా డాలర్ బలహీనపడినప్పుడు, అంతర్జాతీయ అనిశ్చితులు పెరిగినప్పుడు బంగారం వంటి సురక్షిత పెట్టుబడి సాధనాలకు డిమాండ్ పెరుగుతుంది.
ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపించడంతో బంగారం, వెండి ధరలకు మద్దతు లభిస్తోంది.
వివరాలు
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి
ఈ వారంలో అమెరికా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (PPI), కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) గణాంకాలు విడుదల కానున్నాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకునే క్రమంలో ఈ గణాంకాలు కీలకంగా మారనున్నాయి.
అందుకే ప్రపంచవ్యాప్తంగా మదుపర్లు వీటి కోసం ఎదురుచూస్తున్నారు.
అమెరికా వడ్డీరేట్లపై అంచనాలు, డాలర్ కదలికలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరలు వంటి అంశాలు రానున్న రోజుల్లో బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
దీంతో బంగారం, వెండి ధరల్లో మరింత హెచ్చుతగ్గులు కనిపించవచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.