LOADING...
Gold Rate: గ్లోబల్‌ మార్కెట్‌లో $5,000 దాటిన బంగారం ధర..
గ్లోబల్‌ మార్కెట్‌లో $5,000 దాటిన బంగారం ధర..

Gold Rate: గ్లోబల్‌ మార్కెట్‌లో $5,000 దాటిన బంగారం ధర..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 26, 2026
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు సరికొత్త చరిత్రను లిఖించాయి. తొలిసారిగా ఒక ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర $5,000(సుమారు రూ.4,58,130)మైలురాయిని దాటింది. గత ఏడాది ఇప్పటికే పసిడి ధర 60శాతానికి పైగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇదే ఊపు ఈ ఏడాదిలోనూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రీన్‌ల్యాండ్ అంశంపై అమెరికా,ఇతర నాటో దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది. భౌగోళిక రాజకీయ ఆందోళనలు తీవ్రతరం కావడంతో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వాణిజ్య విధానాలు పెట్టుబడిదారులను కలవరపెడుతున్నాయి. చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే 100శాతం సుంకం విధిస్తామని ఆయన హెచ్చరించడంతో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

వివరాలు 

గత ఏడాది వెండి ధర దాదాపు 150 శాతం పెరిగింది 

ఇలాంటి అనిశ్చిత కాలంలో పెట్టుబడిదారులు భద్రమైన పెట్టుబడులైన సేఫ్ హేవన్ ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. అందులో బంగారం,ఇతర విలువైన లోహాలు ప్రధానంగా ఉంటాయి.ఈ క్రమంలోనే శుక్రవారం వెండి ధర కూడా ఔన్స్‌కు $100 మార్క్‌ను దాటింది. గత ఏడాది వెండి ధర దాదాపు 150 శాతం పెరిగిన విషయం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణం, బలహీనపడుతున్న అమెరికా డాలర్,ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెంచడం, అలాగే ఈ ఏడాది వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు బంగారం, వెండి డిమాండ్‌ను మరింత పెంచాయి. యుక్రెయిన్-రష్యా యుద్ధం, గాజాలో కొనసాగుతున్న సంఘర్షణ, వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మాదురోపై అమెరికా తీసుకున్న చర్యలు వంటి ఘటనలు కూడా బంగారం ధరలకు మద్దతుగా నిలిచాయి.

వివరాలు 

1979 తర్వాత మళ్లీ అదే స్థాయిలో భారీ లాభాలు

2025 సంవత్సరం బంగారానికి బ్లాక్‌బస్టర్ ఏడాదిగా మారిందని చెప్పొచ్చు.1979 తర్వాత మళ్లీ అదే స్థాయిలో భారీ లాభాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాలు,కృత్రిమ మేధస్సుకు సంబంధించిన షేర్లు ఇప్పటికే అధిక విలువ వద్ద ఉన్నాయనే భయాలు మార్కెట్లను కుదిపేయడంతో బంగారం వరుసగా కొత్త రికార్డులను సాధిస్తోంది. వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు ఉన్నప్పుడు కూడా బంగారం ధరలు పెరుగుతుంటాయి. తక్కువ వడ్డీరేట్లు బాండ్‌ల వంటి పెట్టుబడులపై వచ్చే లాభాలను తగ్గిస్తాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం,వెండి వంటి ప్రత్యామ్నాయ ఆస్తుల వైపు దృష్టి పెడతారు. ఈఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రధాన వడ్డీ రేటును రెండుసార్లు తగ్గిస్తుందన్న అంచనాలు ప్రస్తుతం మార్కెట్‌లో బలంగా వినిపిస్తున్నాయి.

Advertisement