Loading...
PhonePe: యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఛార్జీలు ఉండవు: ఫోన్‌పే సీఈవో
యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఛార్జీలు ఉండవు: ఫోన్‌పే సీఈవో

PhonePe: యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఛార్జీలు ఉండవు: ఫోన్‌పే సీఈవో

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం సాధారణ వినియోగదారుల్లో ఆందోళనకు కారణమైంది. యూపీఐ లావాదేవీలకు సంబంధించిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో.. ఇకపై డిజిటల్ చెల్లింపులపై రుసుములు వసూలు చేస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు. భారతీయ వినియోగదారులు యూపీఐ లావాదేవీల కోసం ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన నిగమ్.. డిజిటల్ లావాదేవీలపై భారతీయ వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేశారు.

వివరాలు

వ్యక్తిగత లావాదేవీలకు ఛార్జీలు ఉండవు

పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007కు ప్రతిపాదించిన సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే.

అయితే ఈ సవరణల వల్ల వ్యక్తిగత యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది.

ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల బ్యాంకు ఖాతాలకు యూపీఐ ద్వారా డబ్బు పంపితే.. అలాంటి వ్యక్తిగత నగదు లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వర్తించవు.

వివరాలు

కొన్ని వ్యాపార చెల్లింపులపైనే ఎండీఆర్‌?

ఆర్థిక శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. రూ.1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న షాపింగ్ మాల్స్, కార్పొరేట్ సూపర్ మార్కెట్లు, లగ్జరీ హోటళ్లు వంటి పెద్ద వ్యాపార సంస్థల్లో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపై మాత్రమే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధించే అవకాశం ఉంది.

అయితే భవిష్యత్తులో ఈ ఛార్జీలను ఇతర రకాల యూపీఐ లావాదేవీలకూ వర్తింపజేస్తారేమోనన్న భయాలు వినియోగదారుల్లో నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

భారతీయ వినియోగదారులకు యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేయడంతో సాధారణ యూజర్లలో నెలకొన్న ఆందోళనకు కొంతమేర స్పష్టత వచ్చినట్లైంది.

ADVERTISEMENT