India: సుదీర్ఘ లక్ష్యానికి చేరువలో భారత్.. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుదల!
భారతదేశం మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ముందంజలో ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2030-31 నాటికి ఈ లక్ష్యాన్ని భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆ నివేదిక అంచనా వేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8.2 శాతం ఉంటుందని పేర్కొంది. దేశ ఆర్థిక పురోగతికి కొనసాగుతున్న సంస్కరణలు కీలకమని నొక్కి చెప్పింది. సంస్కరణల ప్రాముఖ్యతను వివరించేటప్పుడు, ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడం, లాజిస్టిక్ వ్యవస్థను మెరుగుపరచడం, ప్రభుత్వ మూలధన వినియోగాన్ని తగ్గించడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది.
మౌలిక వసతులకు మరింత మద్దతు
దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి, పోటీతత్వాన్ని పెంచడానికి నిర్మాణాత్మక మార్పులు అవసరమని సంస్థ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, భారత ఈక్విటీ మార్కెట్లు కూడా బలమైన వృద్ధి దిశగా పయనిస్తున్నాయని తెలిపింది. భారత వాణిజ్యానికి 90 శాతం పైగా సముద్ర మార్గాలు కీలకం కావడంతో తీరప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా వాణిజ్య అవకాశాలు మరింతగా పెరుగుతాయని S&P గ్లోబల్ పేర్కొంది. సముద్ర మార్గాల్లో ఉన్న మౌలిక వసతుల అభివృద్ధి ఎగుమతులు, దిగుమతులకు మరింత మద్దతు ఇస్తుందని వివరించింది.
ఉత్పాదకను పెంచడంలో పురోగతి
ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో, పునరుత్పాదక ఇంధనాలవైపు భారత్ ముందడుగు వేస్తోందని నివేదిక వెల్లడించింది. కాలుష్య రహిత ఇంధన వాడకం, పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా ఇంధన భద్రతను సమతుల్యం చేయడం దేశానికి కీలకమని చెప్పింది. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతలను అందుబాటులోకి తేవడం ద్వారా ఉత్పాదకతను పెంచడంలో పురోగతి సాధించింది. అయితే ఆహార భద్రత, నీటి పారుదల, ఆహార నిల్వలు, పంపిణీ వంటి కీలక సవాళ్లు దేశం ఎదుర్కొంటుందని నివేదిక హెచ్చరించింది.