Loading...
Groww, Zerodha: గ్రోవ్, జెరోధాలో యూఎస్ స్టాక్స్ ట్రేడింగ్.. రిస్కులు, ప్రయోజనాలు ఇవే..
గ్రోవ్, జెరోధాలో యూఎస్ స్టాక్స్ ట్రేడింగ్.. రిస్కులు, ప్రయోజనాలు ఇవే..

Groww, Zerodha: గ్రోవ్, జెరోధాలో యూఎస్ స్టాక్స్ ట్రేడింగ్.. రిస్కులు, ప్రయోజనాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టాక్ మార్కెట్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రిటైల్ ఇన్వెస్టర్లు అమెరికా షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లు గ్రోవ్, జెరోధా కీలక అడుగులు వేస్తున్నాయి. భారత స్టాక్ బ్రోకరేజీల్లో 4.6కోట్ల క్రియాశీల ఇన్వెస్టర్లలో 29శాతానికి పైగా వాటా కలిగిన గ్రోవ్.. ఈ నెల ప్రారంభంలోనే అమెరికా షేర్ల ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 10,000కు పైగా అమెరికా స్టాక్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు)లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తోంది. తక్కువ మొత్తంతో కంపెనీల షేర్లలో భాగస్వామ్య యాజమాన్యం పొందే ఫ్రాక్షనల్ షేర్ సదుపాయం కూడా అందిస్తోంది. ఎన్విడియా,స్పేస్‌ఎక్స్ఆపిల్,ఆల్ఫాబెట్,అమెజాన్, మైక్రాన్, మెటా షేర్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు గ్రోవ్ సహ వ్యవస్థాపకుడు హర్ష్ జైన్ తెలిపారు.

వివరాలు 

అమెరికా షేర్లపై ఆసక్తి పెరగడానికి కారణాలివే..

మరోవైపు, 15 శాతం క్రియాశీల ఖాతాదారుల వాటా కలిగిన జెరోధా అమెరికా షేర్ల ట్రేడింగ్‌ను ప్రస్తుతం బీటా పరీక్షిస్తోంది.

మరికొన్ని వారాల్లో ఈ సేవలను ప్రారంభించాలని భావిస్తోంది. 67 లక్షల క్రియాశీల రిటైల్ ఖాతాదారులున్న ఏంజెల్ వన్ కూడా ఈ దిశగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

భారత మార్కెట్ల పనితీరు బలహీనంగా ఉండటం, దేశీయంగా పెద్ద ఏఐ కంపెనీలు లేకపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుండటం విదేశీ పెట్టుబడులపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ ఏడాది ఇప్పటివరకు నిఫ్టీ 50 దాదాపు 13 శాతం పడిపోగా, అమెరికా ఎస్‌అండ్‌పీ 500 సూచీ 12 శాతానికి పైగా పెరిగింది.

ఇదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల నుంచి 3,250 కోట్ల డాలర్లు వెనక్కి తీసుకున్నారు.

వివరాలు 

అమెరికా పెట్టుబడుల్లో రిస్కులు.. నియంత్రణలపై ఆందోళనలు

అయితే, అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ముందు కొన్ని రిస్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

రూపాయి విలువ తగ్గినప్పుడు విదేశీ పెట్టుబడులు కొంత రక్షణ కల్పించవచ్చు.

కానీ రూపాయి బలహీనంగా ఉన్న సమయంలో అమెరికా మార్కెట్లు పెరిగితే, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కరెన్సీపై ఒత్తిడిని మరింత పెంచవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆగస్టులో భారతీయులు ఈక్విటీ, డెట్ పెట్టుబడుల కోసం విదేశాలకు పంపిన నిధులు 32.1 కోట్ల డాలర్లకు చేరాయి.

ఏడాది క్రితంతో పోలిస్తే ఇది 111 శాతం ఎక్కువ.

రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మరింత పెరిగితే, అమెరికా మార్కెట్లలో పెట్టుబడులపై భారత నియంత్రణ సంస్థలు పునరాలోచించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT