Delhi High Court: గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్.. హింద్‌వేర్ కేసులో రూ.30 లక్షల జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ ప్రకటనలు, ట్రేడ్‌మార్క్ హక్కుల పరిరక్షణ విషయంలో కీలక ప్రభావం చూపే తీర్పును దిల్లీ హైకోర్టు వెలువరించింది. గూగుల్ అడ్స్ ప్లాట్‌ఫామ్‌లో 'హింద్‌వేర్' (HINDWARE) అనే నమోదిత ట్రేడ్‌మార్క్‌ను ప్రత్యర్థి కంపెనీలు కీవర్డ్‌గా ఉపయోగించుకునే అవకాశం కల్పించడం ద్వారా గూగుల్ ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘించిందని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ మినీ పుష్కర్ణ గూగుల్‌ను 'హింద్‌వేర్', దానికి సంబంధించిన ఇతర పదాలను ప్రకటనల కీవర్డ్స్‌గా ఉపయోగించకుండా శాశ్వత ఆదేశాలు జారీ చేశారు. అలాగే హింద్‌వేర్ సంస్థకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని గూగుల్‌ను ఆదేశించారు.
వివరాలు
అసలు వివాదం ఏమిటి?
గూగుల్ అడ్స్ విధానంలో ప్రకటనదారులు ఇతర కంపెనీల ట్రేడ్‌మార్క్ పేర్లను కీవర్డ్స్‌గా కొనుగోలు చేయవచ్చు. దీంతో వినియోగదారులు ఆ పేర్లను సెర్చ్ చేసినప్పుడు సంబంధిత ప్రకటనలు ముందుగా కనిపిస్తాయి. హింద్‌వేర్ ఆరోపణల ప్రకారం, గ్రోహే (Grohe), సెరా (Cera) వంటి ప్రత్యర్థి సంస్థలు 'హింద్‌వేర్' అనే కీవర్డ్‌ను కొనుగోలు చేశాయి. ఫలితంగా హింద్‌వేర్ ఉత్పత్తుల కోసం వెతికిన వినియోగదారులకు ముందుగా ఈ కంపెనీల ప్రకటనలు కనిపించాయి.
వివరాలు
ట్రేడ్‌మార్క్ కనిపించకపోయినా ఉల్లంఘనే..
కీవర్డ్స్ అనేవి వినియోగదారులకు కనిపించని సాంకేతిక అంశాలు మాత్రమేనని, అవి ట్రేడ్‌మార్క్ వినియోగంగా పరిగణించలేమని గూగుల్ వాదించింది. అయితే ఈ వాదనను కోర్టు తిరస్కరించింది. ట్రేడ్‌మార్క్ ఒక ప్రకటనలో ప్రత్యక్షంగా కనిపించకపోయినా, ప్రకటనలను ప్రేరేపించే కీవర్డ్‌గా ఉపయోగిస్తే అది కూడా ట్రేడ్‌మార్క్ వినియోగంగానే పరిగణించాలని స్పష్టం చేసింది.
వివరాలు
హింద్‌వేర్ పేరుకు ప్రత్యేక గుర్తింపు
'హింద్‌వేర్' అనేది నిఘంటువులో అర్థం లేని ప్రత్యేకంగా సృష్టించిన బ్రాండ్ పేరు అని కోర్టు పేర్కొంది. కాబట్టి 'హింద్‌వేర్' అని సెర్చ్ చేసే వినియోగదారులు ఆ సంస్థ ఉత్పత్తులనే వెతుకుతున్నారని, సాధారణ శానిటరీ వేర్ ఉత్పత్తులను కాదని తెలిపింది. అలాంటి సెర్చ్‌లలో ప్రత్యర్థి సంస్థల ప్రకటనలను చూపించడం ద్వారా హింద్‌వేర్ బ్రాండ్ ప్రతిష్ఠను అన్యాయంగా ఉపయోగించుకున్నట్టేనని వ్యాఖ్యానించింది.
వివరాలు
బ్రాండ్ విలువను విక్రయించిన గూగుల్
హింద్‌వేర్ బ్రాండ్‌కు ఉన్న మార్కెట్ ఆకర్షణను గూగుల్ వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని కోర్టు అభిప్రాయపడింది. ట్రేడ్‌మార్క్‌ను వేలం వేసి ప్రకటనదారులకు విక్రయించడం, వినియోగదారులు ప్రకటనలపై క్లిక్ చేసిన ప్రతిసారీ ఆదాయం పొందడం ద్వారా గూగుల్ తనకు హక్కులేని ట్రేడ్‌మార్క్‌ను వాణిజ్యపరంగా వినియోగించుకుందని పేర్కొంది.
వివరాలు
కీవర్డ్ బిడ్డింగ్‌ను ప్రోత్సహించినట్లు వ్యాఖ్య
గూగుల్ కీవర్డ్ ప్లానింగ్, సూచనల వ్యవస్థల ద్వారా ప్రత్యర్థి కంపెనీల ట్రేడ్‌మార్క్‌లపై బిడ్డింగ్ చేయడానికి ప్రకటనదారులను ప్రోత్సహించిందని హింద్‌వేర్ వాదించింది. ఈ వాదనను కోర్టు సమర్థించింది. పే-పర్-క్లిక్ మోడల్ ద్వారా అలాంటి సెర్చ్‌లను గూగుల్ ఆదాయ వనరుగా మార్చుకుందని పేర్కొంది. ఐటీ చట్టం రక్షణ వర్తించదన్న కోర్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం మధ్యవర్తి (ఇంటర్మీడియరీ) సంస్థలకు లభించే రక్షణ గూగుల్‌కు వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. గూగుల్ కేవలం ఇతరుల కంటెంట్‌ను హోస్ట్ చేసే వేదిక మాత్రమే కాదని, కీవర్డ్ వేలం వ్యవస్థ నిర్వహించడం,ప్రకటనల స్థానాలను నిర్ణయించడం,కీవర్డ్ సూచనలు ఇవ్వడం,వాటి ద్వారా ఆదాయం పొందడం వంటి క్రియాశీల పాత్ర పోషిస్తోందని పేర్కొంది.
వివరాలు
ట్రేడ్‌మార్క్ యజమానులపైనే అదనపు భారం
గూగుల్ విధానాల వల్ల ట్రేడ్‌మార్క్ యజమానులు తమ సొంత బ్రాండ్ పేర్లపైనే ప్రకటనల కోసం బిడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఇతరుల మేధో సంపత్తి ద్వారా గూగుల్ లాభపడటమే కాకుండా, తమ బ్రాండ్ రక్షణ కోసం యజమానులే ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపింది.
వివరాలు
హింద్‌వేర్‌కు అనుకూలంగా తీర్పు
గూగుల్ చర్యలు ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన, అన్యాయ ప్రయోజనం పొందడం, ప్రసిద్ధ బ్రాండ్ విలువను తగ్గించడం వంటి అంశాలకు దారితీసినట్లు కోర్టు తేల్చింది. దీంతో హింద్‌వేర్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తూ రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని గూగుల్‌ను ఆదేశించింది. ట్రేడ్‌మార్క్ పేర్లను ప్రకటనల కీవర్డ్స్‌గా వినియోగించే అంశంపై భారతదేశంలో వచ్చిన అత్యంత కీలకమైన న్యాయ తీర్పుల్లో ఇది ఒకటిగా నిలిచింది.