Oil Prices: ఇంధన సెగ తగ్గాలంటే రోజుకు 100 నౌకలు హర్మూజ్ దాటాల్సిందే..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు అంతం కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్చరించింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్ల రాకపోకలు భారీగా దెబ్బతినడం ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఘర్షణలకు పరిష్కారం లభిస్తే.. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు త్వరలో పరిష్కారం లభిస్తుందని తాము భావిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. అదే జరిగితే బ్రెంట్ క్రూడ్ ధర ఒక బ్యారెల్‌కు 70 నుంచి 80 డాలర్ల పరిధిలో ఉండొచ్చని అంచనా వేసింది. అయితే వివాదం పరిష్కారం కాకపోతే ఈ శీతాకాలంలో ఇంధన ధరల భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది.
వివరాలు
హర్మూజ్‌లో భారీగా తగ్గిన నౌకల రాకపోకలు
ప్రస్తుతం హర్మూజ్ జలసంధి మీదుగా రోజుకు కేవలం 5 నుంచి 10 నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి.
యుద్ధానికి ముందు ఇదే మార్గంలో రోజుకు సుమారు 140నౌకలు రాకపోకలు సాగించేవి.
దీంతో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే ప్రతిరోజూ కనీసం 80 నుంచి 100 నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాల్సి ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా వివరించింది.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ముడిచమురు కొరత పెద్దగా లేదని బ్యాంక్ ఆఫ్ అమెరికా తెలిపింది.
అయితే సమస్య అంతా తుది ఇంధన ఉత్పత్తుల వద్దే ఉందని పేర్కొంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి శుద్ధి చేసిన ఇంధనాల సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడుతోందని వెల్లడించింది.
దీంతో ముడిచమురు అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగదారులపై ఇంధన ధరల ఒత్తిడి కొనసాగుతోంది.
వివరాలు
అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవీకాలం పూర్తయ్యే వరకు అమెరికాతో చర్చలు జరిపే అవకాశం లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది.
అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు హర్మూజ్ జలసంధిని తెరవబోమని కూడా తేల్చి చెప్పింది.
ఈ పరిణామాలతో ప్రపంచ దేశాల్లో ఇంధన సరఫరా, ధరలపై ఆందోళనలు మరింత పెరిగాయి.
క్రూడ్ ధరలు ఇలా..
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర ఒక బ్యారెల్‌కు సుమారు 88 డాలర్ల వరకు ఉంది.
మరోవైపు అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (WTI) క్రూడ్ ధర 82.20 డాలర్ల వద్ద కదలాడుతోంది.
అమెరికా-ఇరాన్ ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో రాకపోకలు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయన్నది ప్రపంచ ఇంధన మార్కెట్లకు కీలకంగా మారింది.