'Toxic' Beauty Products: భారత్‌లో పాకిస్థాన్ 'వైటనింగ్ క్రీమ్'లు.. CDSCO సంచలన హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో అనుమతులు లేకుండా విక్రయిస్తున్న రెండు పాకిస్థాన్ సౌందర్య ఉత్పత్తులపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) ఆందోళన వ్యక్తం చేసింది. లాహోర్‌కు చెందిన సంస్థలు తయారు చేసిన 'గోరీ బ్యూటీ క్రీమ్', 'చాందినీ వైటనింగ్ క్రీమ్'లో పరిమితికి మించిన భార లోహాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని, ఇప్పటికే కొన్నవారు వినియోగించవద్దని సెప్టెంబర్ 8న ప్రజారోగ్య హెచ్చరిక జారీ చేసింది. ఈ క్రీమ్‌లలో ఉన్న భార లోహాలు వినియోగదారులకు విష ప్రభావాలతో సహా ఆరోగ్య సమస్యలు కలిగించే ప్రమాదం ఉందని CDSCO తెలిపింది. అలాగే, భారత్‌లో దిగుమతి చేసి విక్రయించేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా వీటికి లేదని పేర్కొంది.
vivaralu
క్రీమ్‌లపై CDSCO ఏం గుర్తించింది?
CDSCO వివరాల ప్రకారం.. గోరీ కాస్మెటిక్స్ తయారు చేసిన 'గోరీ బ్యూటీ క్రీమ్', ఎస్‌జే ఎంటర్‌ప్రైజెస్ తయారు చేసిన 'చాందినీ వైటనింగ్ క్రీమ్' రెండూ అనుమతి లేని సౌందర్య ఉత్పత్తులు.
ఈ రెండు సంస్థలూ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్నాయి. క్రీమ్‌లలో నిర్దేశిత పరిమితులకు మించి భార లోహాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.
వీటిని కొనుగోలు చేయడం, వినియోగించడం, విక్రయించడం, పంపిణీ చేయడం లేదా ప్రకటనలు ఇవ్వడం చేయవద్దని CDSCO వినియోగదారులు, వ్యాపారులు, సంస్థలు, వ్యక్తులను ఆదేశించింది.
వివరాలు
దిగుమతి సౌందర్య ఉత్పత్తులపై భారత్ నిబంధనలు ఇవే!
భారత్‌లో విదేశాల నుంచి దిగుమతి చేసే సౌందర్య ఉత్పత్తులను నేరుగా తీసుకొచ్చి విక్రయించడానికి వీల్లేదు.
2020 నాటి కాస్మెటిక్స్ నిబంధనల ప్రకారం.. దిగుమతి చేసే కాస్మెటిక్స్‌కు దేశంలోకి తీసుకురాకముందే కేంద్ర లైసెన్సింగ్ అథారిటీ నుంచి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
దేశీయంగా తయారు చేసే సౌందర్య ఉత్పత్తులకు సంబంధిత రాష్ట్ర లైసెన్సింగ్ సంస్థ నుంచి అనుమతి అవసరం.
దిగుమతి కాస్మెటిక్స్ చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేకుండానే దేశీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నారన్న విషయాన్ని జులై 2026లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ రఘువంశీ రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థలు, CDSCO కార్యాలయాలకు ఇచ్చిన ఆదేశాల్లో ప్రస్తావించారు. నిఘాను పెంచాలని సూచించారు.
వివరాలు
పాకిస్థాన్ వస్తువుల దిగుమతిపై నిషేధం
ఈ వ్యవహారంలో మరో ముఖ్యమైన అంశం ఉంది. పాకిస్థాన్‌లో తయారైన లేదా అక్కడి నుంచి ఎగుమతి అయ్యే వస్తువులను నేరుగా లేదా పరోక్షంగా భారత్‌లోకి దిగుమతి చేసుకోవడం, రవాణా చేయడాన్ని 2025 మే 2న విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (DGFT) తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిషేధించింది.
అయినప్పటికీ, ఈ రెండు క్రీమ్‌లు భారత్‌లోని పలు ఈ-కామర్స్ వేదికల్లో కనిపించాయి.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, టాటా 1ఎంజీ, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ వేదికల్లో ఈ క్రీమ్‌లను విక్రయానికి ఉంచినట్లు బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది.
కోన్ని జాబితాల్లో 'మేడ్ ఇన్ ఇండియా' అని పేర్కొనగా.. తయారీదారు, విక్రేత లేదా ప్యాకర్ వివరాలు స్పష్టంగా లేవని సమాచారం.
వివరాలు
పాకిస్థాన్ వస్తువుల దిగుమతిపై నిషేధం
అమెజాన్‌లోని గోరీ బ్యూటీ క్రీమ్ జాబితా తరువాత తొలగించబడింది. అందులో ఉత్పత్తి మూల దేశంగా భారత్‌ను పేర్కొని, 'నేహా ఆర్గానిక్'ను తయారీదారు, ప్యాకర్‌గా చూపించారు.
ఈ విషయంపై అమెజాన్ ప్రతినిధి స్పందిస్తూ.. Amazon.in అనేది స్వతంత్ర థర్డ్ పార్టీ విక్రేతలు తమ ఉత్పత్తులను జాబితా చేసి విక్రయించే ఆన్‌లైన్ మార్కెట్ వేదిక అని తెలిపారు.
విక్రేతలు భారత చట్టాలు, అమెజాన్ విధానాలను పాటించాల్సి ఉంటుందని, సంబంధిత నియంత్రణ సంస్థల ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధమైన ఉత్పత్తుల జాబితాలను తొలగిస్తామని చెప్పారు.
వివరాలు
పరోక్ష మార్గాల్లో భారత్‌కు చేరిన పాక్ క్రీమ్‌లు?
పాకిస్థాన్ నుంచి నేరుగా కాకుండా.. యూఏఈ, నేపాల్ వంటి ఇతర దేశాలను మధ్యవర్తులుగా ఉపయోగించి ఈ ఉత్పత్తులను భారత్‌కు పంపించి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.
టీమ్‌లీజ్ రెగ్‌టెక్ సహ వ్యవస్థాపకుడు,సీఈఓ రిషి అగర్వాల్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉత్పత్తులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), నేపాల్ వంటి దేశాల మీదుగా భారత్‌కు చేరే అవకాశం ఉందన్నారు.
పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సంస్థలు స్నేహపూర్వక దేశాల పంపిణీ వ్యవస్థలను ఉపయోగించి ఉత్పత్తులను భారత్‌కు మళ్లించి ఉండొచ్చని పేర్కొన్నారు.
మరోవైపు,పాకిస్థాన్ ఉత్పత్తులను మూడో దేశం మీదుగా భారత్‌కు తరలించి, వాటి మూల దేశాన్ని మార్చి చూపించేలా దిగుమతి పత్రాల్లో తప్పుడు వివరాలు నమోదు చేసే అవకాశం ఉందని ఓ రిటైర్డ్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పేరు వెల్లడించకుండా తెలిపారు.
వివరాలు
ఆన్‌లైన్ వేదికల నుంచి ఉత్పత్తుల తొలగింపు
అయితే, ఈ ఉత్పత్తులు వాస్తవంగా ఏ మార్గంలో భారత్‌కు చేరాయన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదు.
వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కొన్ని ఈ-కామర్స్ సంస్థలు చర్యలు చేపట్టాయి.
ఉత్పత్తి మూల దేశానికి సంబంధించిన సమాచారం తప్పుగా ఉన్నట్లు గుర్తించిన తర్వాత అమెజాన్ గోరీ బ్యూటీ క్రీమ్ జాబితాను తొలగించింది.
ఫ్లిప్‌కార్ట్ ఆ సంస్థను గుర్తించి, ఉత్పత్తులు తమ నిబంధనలను ఉల్లంఘించాయా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మీషోలోని ఓ అధికారి మాట్లాడుతూ.. ఉత్పత్తి మూల దేశంగా భారత్‌ను నమోదు చేయడంతో గతంలో చేపట్టిన తొలగింపు చర్య నుంచి ఇది తప్పించుకుని ఉండవచ్చని తెలిపారు. అనంతరం ఆ ఉత్పత్తిని వేదిక నుంచి తొలగించారు.
వివరాలు
వినియోగదారులకు CDSCO సూచనలు
సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు ప్యాకేజింగ్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని CDSCO వినియోగదారులకు సూచించింది.
తయారీదారు వివరాలు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, దిగుమతి ఉత్పత్తులకు అవసరమైన రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని తెలిపింది.
రెండు అనుమతి లేని ఉత్పత్తులు తమ పరిధిలో విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని అమలు సంస్థలను ఆదేశించింది.
నియంత్రణ సంస్థల హెచ్చరికలు సరఫరా వ్యవస్థలో చివరి స్థాయి పంపిణీదారులు, రిటైలర్ల వరకు చేరేలా ఔషధ నియంత్రణ సంస్థలు కాస్మెటిక్స్, ఔషధాల పంపిణీదారులు, విక్రేతల జాబితాలను నిర్వహించాలని రిషి అగర్వాల్ సూచించారు.
అనుమతి లేని ఉత్పత్తులను కొనసాగిస్తూ విక్రయించే రిటైలర్లు, ఈ-కామర్స్ వేదికలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.