LOADING...
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ లాభాలు.. రూ.14,755 కోట్ల నికర లాభం నమోదు
ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ లాభాలు.. రూ.14,755 కోట్ల నికర లాభం నమోదు

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ లాభాలు.. రూ.14,755 కోట్ల నికర లాభం నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2025-26) జనవరి-మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలంలో బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం రూ.14,755కోట్లకు చేరగా, గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,502 కోట్లతో పోలిస్తే 9.28 శాతం వృద్ధి నమోదైంది. స్టాండలోన్‌ ప్రాతిపదికన నికర లాభం రూ.12,630 కోట్ల నుంచి 8.5 శాతం పెరిగి రూ.13,702 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే బ్యాంక్‌ నికర లాభం రూ.50,147 కోట్లకు పెరిగింది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.47,227 కోట్లతో పోలిస్తే 6.2 శాతం అధికం. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (NII) 8.4 శాతం పెరిగి రూ.22,979 కోట్లకు చేరింది.

వివరాలు

ఆస్తుల నాణ్యత విషయంలో మెరుగుదల

నికర వడ్డీ మార్జిన్‌ (NIM) 4.32 శాతంగా నమోదైంది. వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ మినహాయించి) 5.6 శాతం పెరిగి రూ.7,415 కోట్లకు చేరగా, ట్రెజరీ విభాగంలో రూ.106 కోట్ల నష్టం నమోదైంది. ఇదే సమయంలో నిర్వహణ వ్యయాలు 12 శాతం పెరిగి రూ.12,089 కోట్లకు చేరాయి. ఆస్తుల నాణ్యత విషయంలో బ్యాంక్‌ మెరుగుదల సాధించింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPAలు) 1.53 శాతం నుంచి 1.4 శాతానికి తగ్గాయి. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇవి 1.67 శాతంగా ఉండేవి. స్థూల మొండి బకాయిలు రూ.4,242 కోట్లుగా నమోదయ్యాయి. కేటాయింపులు గణనీయంగా తగ్గి రూ.891 కోట్ల నుంచి రూ.96.16 కోట్లకు చేరాయి.

వివరాలు

కార్పొరేట్‌ రుణాలు 9 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి

కాగా, డిసెంబర్ త్రైమాసికంలో ఇవి రూ.2,556 కోట్లుగా ఉన్నాయి. దేశీయ కార్పొరేట్‌ రుణాలు 9 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. అయితే మొత్తం రుణ పుస్తకంలో వాటి వాటా తగ్గి 20 శాతానికి పరిమితమైంది. 2026 మార్చి 31 నాటికి బ్యాంక్‌ మూలధన సమృద్ధి నిష్పత్తి 17.18 శాతంగా ఉండగా, ప్రధాన బఫర్‌ 16.35 శాతంగా నమోదైంది. ఇక షేర్‌హోల్డర్లకు గుడ్‌న్యూస్‌గా, రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.12 తుది డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ Sandeep Batra వెల్లడించారు.

Advertisement