Jyotiraditya Scindia: భారత్‌లో గుత్తాధిపత్యానికి తావులేదు.. మస్క్ ఆరోపణలను తిప్పికొట్టిన సింధియా
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కాకుండా కొందరు దేశీయ పారిశ్రామికవేత్తలు అడ్డుకుంటున్నారంటూ ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని భారత్ అనుమతించబోదని స్పష్టం చేశారు. ఏ సంస్థకైనా దేశంలో సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చే ముందు భద్రతాపరమైన నిబంధనలను పూర్తిగా పరిశీలిస్తామని తెలిపారు. అన్ని శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) సంస్థలకు ఒకే తరహా నియంత్రణ, భద్రతా నిబంధనలను అమలు చేస్తామని వెల్లడించారు.
వివరాలు
స్పెక్ట్రమ్ ధరలపై త్వరలో నిర్ణయం
శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు అవసరమైన స్పెక్ట్రమ్ ధరల విధానంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్),టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ)త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సింధియా పేర్కొన్నారు.
స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించి ఛార్జీల విధానం ఖరారైన తర్వాత సంబంధిత సంస్థలకు స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తారని తెలిపారు.
ఇప్పటికే భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు స్టార్‌లింక్, జియో శాట్‌కామ్, యుటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థలకు ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేసిందని ఆయన వివరించారు.
అయితే లైసెన్సులు పొందినంత మాత్రాన సేవలను వెంటనే ప్రారంభించలేవని స్పష్టం చేశారు.
భద్రతాపరమైన అవసరాలు, ప్రభుత్వం విధించిన ఇతర షరతులను పూర్తిగా నెరవేర్చిన తర్వాతే ఆయా సంస్థలు దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు అనుమతి పొందుతాయని పేర్కొన్నారు.
వివరాలు
రాహుల్ గాంధీ విమర్శలపైనా స్పందన
భారత్‌లో శాట్‌కామ్ సేవల ప్రారంభంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కూడా సింధియా తప్పుబట్టారు.
గతంలో ఒక వ్యక్తికి లైసెన్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, ఇప్పుడు అదే వ్యక్తితో పొత్తు పెట్టుకుని, ఆయనకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ వైఖరిలో స్పష్టత లేదని వ్యాఖ్యానించిన సింధియా.. ఆ పార్టీ రోజురోజుకూ ఎటువైపు వెళ్తోందో దానికే తెలియడం లేదని అన్నారు.
శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని పునరుద్ఘాటించారు.
సంస్థలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియలో భద్రతా నిబంధనలు, నియంత్రణ విధానాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.