Loading...
New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ క్యాన్సిలేషన్‌పై కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ క్యాన్సిలేషన్‌పై కొత్త రూల్స్

New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ క్యాన్సిలేషన్‌పై కొత్త రూల్స్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 02, 2026
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

విమాన టికెట్ బుక్ చేసేటప్పుడు కనిపించే ధర ఒకటి.. చివరకు చెల్లించాల్సిన మొత్తం మరొకటి. ప్రయాణం రద్దు చేసుకుంటే ఎంత డబ్బు తిరిగి వస్తుందో కూడా చాలామందికి ముందుగా తెలియదు. ఈ గందరగోళానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విమానయాన నిబంధనలను తీసుకొచ్చింది. ఇకపై టికెట్ ధరతోపాటు పన్నులు, ఇతర ఫీజులు, క్యాన్సిలేషన్ ఛార్జీలు, రీఫండ్ షరతులను కూడా విమానయాన సంస్థలు స్పష్టంగా వెల్లడించాలి. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.

Details

టికెట్ ధరలో దాచిన ఛార్జీలకు అవకాశం ఉండకూడదు

భారతీయ విమానయాన నియమాలు-2026లోని రూల్ 192 ప్రకారం, ప్రయాణికుడు చెల్లించాల్సిన మొత్తం వివరాలను బుకింగ్ వెబ్‌సైట్‌లో, టికెట్‌లో విడివిడిగా చూపించాలి.

అసలు టికెట్ ధర ఎంత? పన్నులు ఎంత? ఇతర ఫీజులు ఏవి? ప్రయాణం రద్దు చేస్తే ఎంత ఛార్జీ పడుతుంది? ఎంత మొత్తం తిరిగి వస్తుంది? అనే వివరాలు ముందే తెలుసుకునే అవకాశం కల్పించాలి.

ఈ నిబంధన భారత్‌కు, భారత్‌ నుంచి లేదా భారత గగనతలం మీదుగా షెడ్యూల్డ్ విమాన సర్వీసులు నడిపే దేశీయ, విదేశీ సంస్థలకు వర్తిస్తుంది. ప్రయాణికులు టికెట్ బుక్ చేసే ముందే అన్ని వివరాలను పరిశీలించాలి.

Details

విమానయాన సంస్థల ధరలపై డీజీసీఏ నిఘా

కొత్త నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు తమ టారిఫ్ వివరాలను వెబ్‌సైట్లు లేదా ఇతర డిజిటల్ వేదికల్లో ప్రచురించాలి.

ఇందుకోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచించిన విధానాన్ని అనుసరించాలి. భారతీయ షెడ్యూల్డ్ విమానయాన సంస్థలు తమ ధరల వివరాలను నిర్ణీత ఫార్మాట్‌లో, నిర్దేశించిన వ్యవధుల్లో డీజీసీఏకు సమర్పించాలి.

ఈ ధరలను నియంత్రణ సంస్థ పర్యవేక్షిస్తుంది. వ్యాపార కార్యకలాపాల్లో పారదర్శకత పెరగడంతోపాటు, ప్రయాణికులకు సరైన సమాచారం అందించడమే దీని లక్ష్యం.

ADVERTISEMENT

Details

విమాన టికెట్ ధరలు తగ్గుతాయా?

కొత్త నిబంధనలు వచ్చాయని విమాన టికెట్ ధరలపై గరిష్ఠ పరిమితి విధించినట్లు కాదు. విమానయాన సంస్థలు నిర్వహణ ఖర్చులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సాధారణ పరిస్థితుల్లో ధరలను నిర్ణయించుకోవచ్చు.

ప్రతి టికెట్ ధరకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ధరల నిర్ణయంలో సంస్థలకు స్వేచ్ఛ కొనసాగుతూనే, వాటి వివరాలపై పర్యవేక్షణ ఉంటుంది.

ADVERTISEMENT

Details

జనవరి 1, 2027 నుంచి అమల్లోకి

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నిబంధనలను 2026 అక్టోబర్ 26న నోటిఫై చేయగా, అక్టోబర్ 31న గెజిట్‌లో ప్రచురించింది.

1937 నాటి ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ స్థానంలో వచ్చిన భారతీయ విమానయాన నియమాలు-2026లో ఇవి భాగం.

పాత నిబంధనల్లోనూ ధరల వివరాల వెల్లడికి సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ, క్యాన్సిలేషన్ ఛార్జీలు, రీఫండ్ షరతులను ఇప్పుడు ప్రత్యేకంగా చేర్చారు. దీంతో టికెట్ బుక్ చేసే సమయంలోనే ఖర్చులపై స్పష్టత రావాలి.

ADVERTISEMENT