India's 6G Mission: 6జీపై భారత్ దూకుడు.. స్వదేశీ టెక్నాలజీ, ఏఐతో ప్రపంచంలో అగ్రస్థానమే లక్ష్యం!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఆరో తరం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (6జీ) అమలుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి,కొత్త పేటెంట్ల సృష్టి,స్పెక్ట్రమ్‌ను సమర్థంగా వినియోగించే వ్యవస్థ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ దిశగా విధానాల రూపకల్పన కోసం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో త్వరలో వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. 6జీ సేవలను దేశవ్యాప్తంగా సాఫీగా అమలు చేయాలంటే కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం కీలకమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న సాంకేతిక వ్యవస్థలను ఏకీకృతం చేస్తూ,ఏఐ ఆధారిత నెట్‌వర్క్‌ల వైపు మార్పు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
వివరాలు
6జీ విధానంలో దేశంలోని ప్రతి ప్రాంతానికి ఇంటర్నెట్ సేవలు
ఇందుకోసం టెలికాం శాఖతో పాటు భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, అనుమతి కేంద్రం (IN-SPACe) వంటి సంస్థల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. 6జీ విధానంలో దేశంలోని ప్రతి ప్రాంతానికి ఇంటర్నెట్ సేవలు అందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా సెల్యులర్ టవర్లను ఉపగ్రహాలు,లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) నెట్‌వర్క్‌లతో అనుసంధానం చేసే ప్రణాళికలను పరిశీలిస్తోంది. దీంతో మారుమూల గ్రామాలు,సముద్ర ప్రాంతాలు వంటి దూర ప్రాంతాల్లో కూడా నిరంతర ఇంటర్నెట్ సేవలు అందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా,అంతరిక్షం నుంచి భూమి వరకు కనెక్టివిటీ కోసం ఏఐ సాంకేతికతను వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
వివరాలు
2030 నాటికి ప్రపంచవ్యాప్త 6G పేటెంట్లలో 10% వాటా లక్ష్యం
దీని ద్వారా హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ వంటి అత్యాధునిక సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, డేటా ప్రాసెసింగ్, నిల్వ, సమాచార మార్పిడిని మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ప్రపంచ 6జీ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రపంచ 6జీ పేటెంట్లలో భారత్ వాటా 6 నుంచి 8 శాతం మధ్య ఉండగా, 2030 నాటికి దానిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
అత్యధిక పేటెంట్లు కలిగిన తొలి ఆరు దేశాల్లో భారత్
ఇప్పటికే దేశంలో సుమారు 4 వేల 6జీ సంబంధిత పేటెంట్లు నమోదయ్యాయి. ఈ విభాగంలో అత్యధిక పేటెంట్లు కలిగిన తొలి ఆరు దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. భవిష్యత్ సాంకేతికతలపై పరిశోధనలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2023లో 'భారత్ 6జీ అలయన్స్'ను ఏర్పాటు చేసింది. పరిశోధనా సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, విద్యాసంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి 6జీ సాంకేతికతలో భారత్‌ను ప్రపంచ నాయకుడిగా తీర్చిదిద్దే దిశగా ఈ సంస్థ పనిచేస్తోంది.