India's Services Sector: నాలుగు నెలల గరిష్ఠానికి చేరిన భారత్ సేవల రంగం వృద్ధి
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సేవల రంగం వృద్ధి నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది. దేశీయంగా డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణమని హెచ్‌ఎస్‌బీసీ తాజా సర్వే వెల్లడించింది. అక్టోబర్‌లో భారత్ సేవల రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) సెప్టెంబర్‌లోని 55.2 నుంచి 55.8కి పెరిగింది. అంతర్జాతీయ ఆర్డర్లు తగ్గడం, నియామకాలు మందగించినప్పటికీ ఈ వృద్ధి నమోదైంది.
వివరాలు
దేశీయ డిమాండ్‌తో కొత్త వ్యాపారాలకు ఊతం
సర్వే ప్రకారం.. డిమాండ్‌ను సూచించే కొత్త వ్యాపారాల వృద్ధి జూన్ తర్వాత అత్యంత వేగంగా నమోదైంది.
దేశీయంగా ఆర్డర్లు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. అయితే అంతర్జాతీయ డిమాండ్ మాత్రం బలహీనంగానే ఉంది.
కొత్త ఎగుమతి వ్యాపారాల వృద్ధి 45 నెలల్లోనే అత్యంత నెమ్మదిగా నమోదైంది. సేవల రంగంలో ఉద్యోగ నియామకాలు దాదాపు నిలిచిపోయాయి.
అక్టోబర్‌లో నియామకాల వేగం జూన్ స్థాయిలోనే ఉంది. గత పది నెలల్లో ఇదే అత్యంత నెమ్మదైన నియామకాల రేటు.
వివరాలు
తగ్గిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు
పీఎంఐ సర్వేలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గినట్లు వెల్లడైంది. వినియోగదారులకు సంస్థలు వసూలు చేస్తున్న ధరలు నాలుగు నెలల్లోనే అత్యంత నెమ్మదిగా పెరిగాయి.
ఉత్పత్తి, సేవల కోసం సంస్థలు వెచ్చించే ఖర్చుల పెరుగుదల కూడా ఆరేళ్లకు పైగా కాలంలో కనిష్ఠ స్థాయికి చేరింది.
అయినప్పటికీ విద్యుత్, కార్మికులు, ముడిసరుకులు, రవాణా సేవల ఖర్చులు పెరుగుతున్నాయని సంస్థలు తెలిపాయి.
వివరాలు
భవిష్యత్ వృద్ధిపై ఆశావహంగా ఉన్నా.. ఆచితూచి అడుగులు
సేవల రంగంలో భవిష్యత్ వృద్ధిపై వ్యాపార సంస్థల విశ్వాసం సెప్టెంబర్‌తో పోలిస్తే తగ్గింది.
దీర్ఘకాలిక సగటు కంటే కూడా ఈ సూచీ దిగువన ఉంది. దీంతో భవిష్యత్ వృద్ధిపై సంస్థలు ఆచితూచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సవాళ్లు ఉన్నప్పటికీ తయారీ, సేవల రంగాలను కలిపి లెక్కించే మొత్తం పీఎంఐ సూచీ అక్టోబర్‌లో 56.2కి పెరిగింది.
సెప్టెంబర్‌లో ఇది 55.9గా ఉంది. నాలుగు నెలల్లో ఇదే అత్యధిక స్థాయి.