Indian banks: దేశీయ బ్యాంకులకు భారీ లాభాలు.. మూడు నెలల్లో రూ.1.16 లక్షల కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు భారీ లాభాలను నమోదు చేశాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్) బ్యాంకుల నికర లాభాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం పెరిగాయి. దీంతో మొత్తం లాభాలు రూ.1.16 లక్షల కోట్లకు చేరాయి. రుణాల మంజూరు పెరగడం, వాటిపై వచ్చే వడ్డీ ఆదాయం మెరుగుపడటమే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది. దాదాపు 19 శాతం పెరిగిన రుణాలు బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు దాదాపు 19శాతం పెరిగాయి. ఫలితంగా రుణాలపై వచ్చే వడ్డీ ఆదాయం గణనీయంగా మెరుగుపడింది. మరోవైపు గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకుల లాభాల వృద్ధి కేవలం 4.2 శాతానికే పరిమితమైంది.
వివరాలు
ఆస్తులపై రాబడిలో మెరుగుదల
ఈసారి నమోదైన అధిక వృద్ధికి గత ఏడాది తక్కువ లాభాల పెరుగుదల కూడా ఒక కారణమని నివేదిక పేర్కొంది.
అయితే బాండ్లపై వడ్డీ రేట్లు పెరగడంతో వాటి ద్వారా బ్యాంకులకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది.
బ్యాంకుల ఆస్తులపై రాబడి (ఆర్‌ఓఏ) 0.07 శాతం పాయింట్లు పెరిగి 1.39 శాతానికి చేరింది.
2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం తర్వాత ఇదే అత్యధిక స్థాయి.
అయితే ఒకేసారి లభించిన ప్రత్యేక ఆదాయాలను మినహాయిస్తే ఈ రాబడిలో పెద్దగా మార్పు కనిపించలేదని నివేదిక వివరించింది.
ఈక్విటీపై రాబడి (ఆర్‌ఓఈ) కూడా 0.79శాతం పాయింట్లు పెరిగి 13.6శాతానికి చేరింది.
రుణ నష్టాల కోసం కేటాయింపులు తగ్గడంతో కొన్ని ప్రైవేటు బ్యాంకుల లాభాలు మరింత ఎక్కువగా పెరిగాయి.
వివరాలు
పటిష్ఠంగా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి
బ్యాంకుల ఆర్థిక పటిష్ఠతను తెలియజేసే కామన్ ఈక్విటీ టైర్-1 (సీఈటీ-1) నిష్పత్తి కూడా మెరుగుపడింది.
గత ఏడాదితో పోలిస్తే ఇది 0.87 శాతం పాయింట్లు పెరిగి 15.8 శాతానికి చేరింది.
అన్ని బ్యాంకులూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన కనీస మూలధన ప్రమాణాల కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయని కేర్‌ఎడ్జ్ నివేదిక స్పష్టం చేసింది.
వివరాలు
రెండో అర్ధభాగంలో లాభాల వృద్ధికి బ్రేక్?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో బ్యాంకుల లాభాల వృద్ధి కొంత మందగించే అవకాశం ఉందని కేర్‌ఎడ్జ్ అంచనా వేసింది.
ఒకేసారి లభించే ప్రత్యేక ఆదాయాలు తగ్గడం, బాండ్ల ద్వారా వచ్చే ఆదాయం బలహీనంగా ఉండటం, రుణ నష్టాలను ముందుగానే అంచనా వేసి నిధులు కేటాయించాల్సి రావడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది.
అంతేకాకుండా కొత్తగా అమల్లోకి రానున్న ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ఈసీఎల్) విధానానికి అనుగుణంగా బ్యాంకులు సిద్ధం కావాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో రుణాల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాలను ముందుగానే అంచనా వేసి అదనపు నిధులు కేటాయించాల్సిన అవసరం ఏర్పడవచ్చని నివేదిక తెలిపింది.