బెంగళూరులో ఆఫీస్‌ను విక్రయించేందుకు సిద్ధమవుతున్న ఇంటెల్; దాని విలువ ఎన్ని వందల కోట్లంటే!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ సంస్థ "హైబ్రిడ్-ఫస్ట్" మోడల్‌లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నందున బెంగళూరు కార్యాలయాన్ని విక్రయించాలని యోచిస్తోందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో 250,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియలో ఉన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ చెబుతోంది. దీన్ని దక్కించుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ఆ ఆఫీస్ అమ్మకం డీల్ దాదాపు రూ.రూ. 450 కోట్లకు మించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆఫీస్‌ను అమ్మిన తర్వాత కూడా ఇంటెల్ సంస్థ బెంగళూరులోని అదే ప్రదేశం నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది.
విక్రయం తర్వాత కొత్త యజమానులతో ఇంటెల్ లీజు ఒప్పందం
విక్రయం తర్వాత కొత్త యజమానులతో ఇంటెల్ లీజు ఒప్పందాన్ని కుదుర్చుకోనుందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఆఫీస్ స్థలాన్ని కంపెనీ మూడేళ్లపాటు లీజుకు తీసుకోవచ్చని విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు. బెంగళూరు ఇంటెల్ ఒక ముఖ్యమైన డిజైన్, ఇంజనీరింగ్ కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 14,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 2021లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో "హైబ్రిడ్-ఫస్ట్" మోడల్‌ను ఇంటెల్ ప్రకటించింది. ఇంటెల్ సంస్థకు ఇతర ప్రదేశాల్లో కూడా ఆఫీస్‌లు ఉన్నాయి. అక్కడ కూడా ఇలాంటి రియల్-ఎస్టేట్ వ్యూహాన్ని అవలంబిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ "బోర్డు అంతటా" తొలగింపులను ప్రకటించిన తర్వాత దాని బెంగళూరు స్థలాన్ని విక్రయించే చర్య వచ్చింది.