Stock market: స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల సెగ.. సెన్సెక్స్ 548 పాయింట్లు డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే నష్టాల బాట పట్టాయి. ఇంట్రాడేలో ఒక దశలో సెన్సెక్స్ గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 1,200 పాయింట్లు పడిపోయింది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌యూ), చమురు-గ్యాస్ కంపెనీల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తడం మార్కెట్లపై ప్రభావం చూపింది.
వివరాలు
సెన్సెక్స్ 548 పాయింట్లు డౌన్
గత సెషన్‌లో 72,472.33 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్.. ఈ రోజు ఉదయం 72,771.32 పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది.
ప్రారంభంలో కొంతసేపు సానుకూలంగా కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 72,884.25 పాయింట్ల గరిష్ఠ స్థాయిని అందుకుంది.
ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో క్రమంగా దిగజారింది. ఒక దశలో 71,676.10 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరింది.
చివరకు 547.65 పాయింట్లు కోల్పోయి 71,924.68 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా నష్టాలతో ముగిసింది.
ఈ సూచీ 157.10 పాయింట్లు తగ్గి 22,363.35 వద్ద నిలిచింది. విదేశీ మారక మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.75గా నమోదైంది.
వివరాలు
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు
సెన్సెక్స్-30లోని ప్రధాన కంపెనీల్లో ఐటీసీ, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్‌అండ్‌టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
మరోవైపు బీఈఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
బ్రెంట్ క్రూడ్ 105 డాలర్ల వద్ద
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,174 డాలర్ల వద్ద కొనసాగుతోంది.