Stock market: మెరిసిన ఐటీ స్టాక్స్.. లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల ఊపు సూచీలకు మద్దతుగా నిలిచింది. మార్కెట్ అంచనాలను మించి ఇన్ఫోసిస్ ప్రకటించిన మెరుగైన త్రైమాసిక ఫలితాలు, భవిష్యత్ మార్గదర్శకాలను పెంచడం ఐటీ రంగంలో ర్యాలీకి దారితీసింది. మరోవైపు ఫార్మా, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఒక దశలో సెన్సెక్స్ 750 పాయింట్లకు పైగా లాభాల్లోకి వెళ్లినప్పటికీ, లాభాల స్వీకరణతో చివరికి పరిమిత లాభాలకే స్థిరపడింది. సెన్సెక్స్ ఉదయం 83,670.79 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇది క్రితం ముగింపు స్థాయి 83,382.71తో పోలిస్తే లాభాలతోనే ఓపెనైంది.
Details
నష్టాల్లో సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ షేర్లు
ఇంట్రాడేలో 84,134.97 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ, చివరకు 187.64 పాయింట్ల లాభంతో 83,570.35 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 28.75 పాయింట్లు పెరిగి 25,694.35 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.86గా నమోదైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాలు ఆర్జించాయి. అదే సమయంలో ఎటెర్నల్, ఏషియన్ పెయింట్స్, బీఈఎల్, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64.30 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,610 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.