Itc Hikes Gold Flake Premium: ధూమపాన ప్రియులకు షాక్.. గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ ప్యాకెట్‌పై రూ.10 పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
సిగరెట్ ప్రియులకు మరోసారి ధరల సెగ తగిలింది. ప్రముఖ సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ (ITC) తన గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం బ్రాండ్ సిగరెట్ల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో ప్యాకెట్‌పై ఏకంగా రూ.10 పెంచింది. ఈ పరిణామంతో గురువారం స్టాక్ మార్కెట్‌లో సిగరెట్ కంపెనీల షేర్లు లాభాల బాట పట్టాయి. ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్లు ఇంట్రాడే ట్రేడింగ్‌లో 4 శాతం వరకు పెరిగాయి. పెరుగుతున్న పన్నుల భారం, చట్టబద్ధమైన సిగరెట్ మార్కెట్‌లో అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
నవంబర్ నాలుగో వారం నాటికి గోదాములకు చేరనున్న కొత్త ధరలతో కూడిన సిగరెట్ స్టాక్
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. 60 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవు ఉండే గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం రెగ్యులర్ సైజ్ ఫిల్టర్ టిప్డ్ (RSFT) సిగరెట్ల 10 ప్యాకెట్ల ధరను ఐటీసీ రూ.125 నుంచి రూ.135కు పెంచింది.
అంటే దాదాపు 8 శాతం ధర పెరిగింది. కొత్త ధరలతో కూడిన సిగరెట్ స్టాక్‌లు నవంబర్ నాలుగో వారం నాటికి గోదాములకు చేరనున్నాయి.
2026లో ఈ బ్రాండ్‌పై ఐటీసీ ధరలు పెంచడం ఇది రెండోసారి. గతంలో జూన్‌లో ప్యాకెట్ ధరను రూ.115 నుంచి రూ.125కు పెంచింది.
తాజాగా మరో రూ.10 పెంచడంతో ఈ ఏడాది ప్రారంభ ధరతో పోలిస్తే మొత్తం పెరుగుదల 17.4 శాతానికి చేరింది.
వివరాలు
చట్టబద్ధమైన మార్కెట్‌లో అమ్మకాల పరిమాణంపై ఒత్తిడి
ధరల పెంపు వార్తల నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఐటీసీ షేరు గరిష్ఠంగా 1.61 శాతం పెరిగి రూ.289.10కు చేరింది.
మరోవైపు గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేరు 3.52 శాతం లాభపడి రూ.1,889 స్థాయిని తాకింది.
సిగరెట్లపై పన్నులు భారీగా పెరగడంతో ఐటీసీ తన ధరల విధానాన్ని మరోసారి సమీక్షిస్తోంది.
సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. చట్టబద్ధంగా విక్రయించే సిగరెట్లకు, అక్రమంగా అమ్మే సిగరెట్లకు మధ్య ధరల వ్యత్యాసం పెరుగుతోంది.
ఫలితంగా చట్టబద్ధమైన మార్కెట్‌లో అమ్మకాల పరిమాణంపై ఒత్తిడి కొనసాగుతోంది.
వివరాలు
గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం రెగ్యులర్ సైజ్ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యం
వినియోగదారులు తక్కువ ధరకు లభించే అక్రమ సిగరెట్ల వైపు వెళ్లకుండా చూడటంతో పాటు వ్యాపార లాభదాయకతను కాపాడుకునేలా ధరలను జాగ్రత్తగా సవరిస్తున్నట్లు ఐటీసీ తెలిపింది.
ఈ పరిస్థితుల ప్రభావం కంపెనీ ఆర్థిక ఫలితాల్లోనూ కనిపిస్తోంది.
ఐటీసీ సిగరెట్ వ్యాపారంలో గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం రెగ్యులర్ సైజ్ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం.. కంపెనీ సిగరెట్ వ్యాపార ఆదాయంలో ఈ విభాగం వాటా సుమారు 50 శాతం వరకు ఉంటుంది.
అంతేకాకుండా ఐటీసీ మొత్తం లాభాల్లో సిగరెట్ వ్యాపారం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విభాగంలో లాభాల మార్జిన్లు దాదాపు 70 శాతం వరకు ఉంటాయని అంచనా.
వివరాలు
అక్రమ సిగరెట్ల వ్యాపారం పెరుగుతోందన్న ఐటీసీ
ఒకవైపు పెరుగుతున్న పన్నుల భారాన్ని తట్టుకుంటూ లాభాలను కాపాడుకోవడం, మరోవైపు వినియోగదారులపై ధరల పెంపు ప్రభావాన్ని పరిమితం చేయడం ఐటీసీకి సవాలుగా మారింది.
ఇదే సమయంలో విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న సిగరెట్లతో పోటీని ఎదుర్కొనేందుకు కంపెనీ వ్యూహాలు రచిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త వేరియంట్లు, ట్రేడ్‌మార్క్‌లను ప్రవేశపెట్టి తన సిగరెట్ ఉత్పత్తుల విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది.
దేశీయ మార్కెట్‌లో పన్నుల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ సిగరెట్ల వ్యాపారం పెరుగుతోందని ఐటీసీ పేర్కొంది.
ఈ తరహా అక్రమ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు కూడా ఇటీవల ఎక్కువయ్యాయని వెల్లడించింది.