Loading...
ITR Filing Deadline: నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు .. ఆలస్యమైతే ఎంత జరిమానా?
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు .. ఆలస్యమైతే ఎంత జరిమానా?

ITR Filing Deadline: నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు .. ఆలస్యమైతే ఎంత జరిమానా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు నేడు (జూలై 31) చివరి అవకాశం. ఈ గడువులోపు రిటర్న్స్ సమర్పించని వారు ఆలస్య రుసుముతో పాటు ఇతర ఆర్థిక పరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, ఈ గడువు అన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులకు వర్తించదని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 5.02 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. గత మదింపు సంవత్సరం (2025-26)లో మొత్తం 6.97 కోట్ల రిటర్న్స్ నమోదయ్యాయి.

వివరాలు 

ఎవరెవరు నేటిలోపే ఐటీఆర్ దాఖలు చేయాలి?

ప్రధానంగా వేతన జీవులు, మూలధన లాభాలు లేదా మూలధన నష్టాలు ఉన్న పన్ను చెల్లింపుదారులు,ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 ఫారాలు దాఖలు చేసే వారు జూలై 31లోపే రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది.

అలాగే, వ్యాపారేతర ఆదాయం కలిగి ఉండి ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని సొసైటీలు, ఇతర సంస్థలు ఐటీఆర్-5,ఐటీఆర్-7 ఫారాల ద్వారా నేటిలోపే రిటర్న్స్ ఫైల్ చేయాలి.

వ్యాపారులకు అదనపు గడువు

వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందుతూ ట్యాక్స్ ఆడిట్ పరిధిలోకి రాని పన్ను చెల్లింపుదారులు ఆగస్టు 31వరకు ఐటీఆర్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది.

వీరు ఐటీఆర్-3 లేదా ఐటీఆర్-4 ఫారాలను ఉపయోగించాలి.మరోవైపు, ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరి అయ్యే వ్యక్తులు,సంస్థలు అక్టోబర్ 31 వరకు తమ రిటర్న్స్ సమర్పించవచ్చు.

వివరాలు 

గడువు దాటితే ఎదురయ్యే పరిణామాలు

వేతన జీవులు, అలాగే ఐటీఆర్-1, ఐటీఆర్-2 పరిధిలోకి వచ్చే వారు జూలై 31 గడువును మిస్ అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

మొత్తం ఆదాయం రూ.5లక్షలలోపు ఉంటే రూ.1,000,రూ.5లక్షలు మించిన వారికి రూ.5,000వరకు జరిమానా విధిస్తారు.

అంతేకాకుండా, చెల్లించాల్సిన పన్నుపై నెలకు ఒక శాతం చొప్పున వడ్డీ కూడా వర్తిస్తుంది.

వ్యాపార నష్టాలు,మూలధన నష్టాలను భవిష్యత్ ఆర్థిక సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశాన్ని కూడా కోల్పోతారు.

అదనంగా, ఆదాయపు పన్ను రీఫండ్ రావాల్సి ఉన్నవారికి రీఫండ్ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది.

అందువల్ల, గడువు ముగిసేలోపు అర్హులైన పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను పూర్తి చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT