Jio IPO: జియో ఐపీఓ ఈనెల 21న ప్రారంభం.. ధరల శ్రేణి రూ.1,065- 1,119.. రూ.30,213 కోట్ల సమీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్,టెలికాం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది. ఈ నెల 21న ప్రారంభమయ్యే ఐపీఓ 23వ తేదీతో ముగియనుంది.ఒక్కో షేరుకు రూ.1,065 నుంచి రూ.1,119 వరకు ధరల శ్రేణిని నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ.30,213 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే దేశంలో ఇప్పటివరకు వచ్చిన ఐపీఓల్లో ఇదే అతిపెద్దదిగా నిలవనుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ.10 ముఖ విలువ కలిగిన 27 కోట్ల వరకు తాజా షేర్లను జియో జారీ చేయనుంది. యాంకర్ ఇన్వెస్టర్లు ఈ నెల 19న దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ షేర్లు ఈ నెల 28న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి.
వివరాలు
మదుపర్లు 12 షేర్లతో కూడిన ఒక లాట్‌కు దరఖాస్తు చేసుకోవాలి
మదుపర్లు కనీసం 12 షేర్లతో కూడిన ఒక లాట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
గరిష్ఠ ధర అయిన రూ.1,119 చొప్పున లెక్కిస్తే ఒక లాట్ కోసం రూ.13,428 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
అర్హులైన రిలయన్స్ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.54 చొప్పున రాయితీ కల్పించారు.
వీరి కోసం రూ.500 కోట్ల విలువైన షేర్లను కేటాయించగా, అర్హులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల కోసం రూ.2,500 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేశారు.
అక్టోబరు 14 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కలిగి ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) ఈ కేటాయింపునకు అర్హులు.
వివరాలు
మదుపర్లు 12 షేర్లతో కూడిన ఒక లాట్‌కు దరఖాస్తు చేసుకోవాలి
ముసాయిదా పత్రాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జియో ప్లాట్‌ఫామ్స్ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,46,885 కోట్లకు చేరింది.
2024-25లో నమోదైన రూ.1,28,218 కోట్లతో పోలిస్తే ఇది 14.6 శాతం ఎక్కువ. ఇదే కాలంలో కంపెనీ నికర లాభం కూడా పెరిగింది.
2024-25లో రూ.26,109 కోట్లుగా ఉన్న లాభం 15.1 శాతం వృద్ధితో 2025-26లో రూ.30,049 కోట్లకు చేరింది.
అంతకుముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,09,558 కోట్ల ఆదాయంపై సంస్థ రూ.21,423 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
వివరాలు
షేర్లను విక్రయించడం ద్వారా సమీకరించే మొత్తం నిధులు నేరుగా కంపెనీకే
2026 మార్చి చివరి నాటికి జియో ప్లాట్‌ఫామ్స్‌కు మొత్తం 52.4 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.
ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం రూ.214గా నమోదైంది.మరోవైపు, కంపెనీ మొత్తం రుణాలు గత ఏడాదితో పోలిస్తే 3.1శాతం తగ్గి రూ.70,781 కోట్లకు పరిమితమయ్యాయి.
ఈ ఐపీఓ పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో జరగనుంది. అంటే, షేర్లను విక్రయించడం ద్వారా సమీకరించే మొత్తం నిధులు నేరుగా కంపెనీకే అందుతాయి.
ఈ మొత్తాన్ని అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రుణాల చెల్లింపుతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నారు.
ఐపీఓకు ముందు జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 66.43 శాతం వాటా ఉంది. మెటా, గూగుల్ సంస్థలకు కలిపి 17.7 శాతం వాటా ఉంది.
వివరాలు
హ్యుందాయ్ కంటే 8 శాతం అధికం
2024లో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా కొనసాగుతోంది.
ఈ సంస్థ తన ఐపీఓ ద్వారా రూ.27,858.75 కోట్లు సమీకరించింది.
అయితే, జియో ప్లాట్‌ఫామ్స్ ప్రతిపాదిత ఐపీఓ ద్వారా అంతకంటే 8 శాతం అధికంగా రూ.30,213 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.
దీంతో హ్యుందాయ్ రికార్డు బద్దలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
వివరాలు
ఎల్ఐసీ రూ.20,557.23 కోట్ల సమీకరణ
ఇప్పటివరకు అత్యధిక నిధుల సమీకరణలో రెండో స్థానంలో ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఐపీఓ ద్వారా రూ.20,557.23 కోట్లు సమీకరించింది.
ఈ మొత్తంతో పోలిస్తే జియో ఐపీఓ ద్వారా సుమారు 47 శాతం అధికంగా నిధులు సమీకరించనుంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో జరిగింది.
అయితే, జియో ప్లాట్‌ఫామ్స్ ఇష్యూ పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారానే ఉండటం మరో ముఖ్యమైన తేడా.