Meta : 8 వేల మందికి లేఆఫ్స్.. మళ్లీ ఉద్యోగ ఆఫర్ ఇచ్చిన మెటా? మాజీ ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
మెటా సంస్థ ఉద్యోగుల తొలగింపులు, కొత్త నియామకాల విధానంపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న సమయంలోనే సీనియర్ పోస్టుల కోసం బయట నుంచి అభ్యర్థులను సంప్రదించడం వివాదానికి దారితీసింది. మాజీ మెటా ఇంజినీర్ జాక్ విల్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టెక్ రంగంలో పెద్ద చర్చకు కారణమయ్యాయి. జాక్ విల్సన్ గతంలో మెటాతో పాటు నెట్‌ఫ్లిక్స్, Airbnb సంస్థల్లో కూడా పనిచేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం మెటా సంస్థ తనను ప్రిన్సిపల్ స్థాయి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు ఆహ్వానించిన అదే వారంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 వేల మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ విషయాన్ని విల్సన్ సోషల్ మీడియా వేదిక Xలో వెల్లడించారు.
వివరాలు
వైరల్ అవుతున్న పోస్ట్
"మెటా 8 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న అదే సమయంలో ప్రిన్సిపల్ రోల్ కోసం నన్ను ఇంటర్వ్యూకు పిలిచింది" అంటూ ఆయన చేసిన పోస్టు వైరల్ అయింది. దీంతో టెక్ కంపెనీల నియామక విధానాలు, ఉద్యోగ భద్రత, AI ఆధారిత పునర్వ్యవస్థీకరణపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. విల్సన్ అభిప్రాయం ప్రకారం, ఉద్యోగాల నుంచి తొలగించిన 8 వేల మందిలోనే ఆ పోస్టుకు సరిపోయే ప్రతిభావంతులు చాలామంది ఉండే అవకాశముందని తెలిపారు. నా స్టాఫ్ ఇంజినీర్ స్నేహితుల్లో కొందరిని కూడా తొలగించారు. కాబట్టి ఆ పోస్టుకు సరిపోయే వ్యక్తులు ఇప్పటికే కంపెనీలో ఉన్నారని నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు.
వివరాలు
వాతావరణం విషపూరితంగా మారుతోంది
పెద్ద టెక్ కంపెనీలు ముందుగా భారీగా ఉద్యోగులను తొలగించి, తర్వాత అవసరం ఉన్న చోట మళ్లీ నియామకాలు చేపట్టడం సాధారణ ధోరణిగా మారిందని ఆయన విమర్శించారు. ఉద్యోగులను కేవలం ఖర్చుగా మాత్రమే చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులను కొనసాగించడం సంస్థకు ఆర్థికపరంగానే కాక భావోద్వేగ పరంగానూ మేలు చేస్తుందని పేర్కొన్నారు. "ఉద్యోగుల నుంచి పూర్తి అంకితభావం కోరుతూ, మరోవైపు ఎప్పుడైనా ఉద్యోగం నుంచి తొలగించవచ్చనే పరిస్థితి సృష్టించడం ఎలా సరైనది?" అంటూ విల్సన్ ప్రశ్నించారు. ప్రస్తుతం AI, ఉద్యోగాల కోతల చుట్టూ ఏర్పడుతున్న వాతావరణం "విషపూరితంగా" మారుతోందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 2018లో జరిగిన ఫేస్‌బుక్-కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా కుంభకోణం తర్వాత తాను మెటా నుంచి బయటకు వచ్చానని వెల్లడించారు.
వివరాలు
వేలాది ఉద్యోగులను తొలగించడం సరైన విధానం కాదు
ఆ ఘటన తర్వాత కంపెనీ డేటా గోప్యతపై సరైన శ్రద్ధ చూపడం లేదనే భావన కలిగిందని చెప్పారు. విల్సన్ పోస్టుపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతూ మరోవైపు వేలాది ఉద్యోగులను తొలగించడం సరైన విధానం కాదని పలువురు విమర్శించారు. ఉద్యోగులను తొలగించి కొత్తవారిని తీసుకోవడం కంటే, ప్రస్తుతం ఉన్న వారికే కొత్త నైపుణ్యాలు నేర్పించడం మంచిది కాదా?" అని కొందరు ప్రశ్నించారు. మరికొందరు మాత్రం ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన సీనియర్ పోస్టుల కోసం బయటి నుంచి నియామకాలు చేపట్టడం వ్యాపారపరంగా సరైన నిర్ణయమే కావచ్చని అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఏఐ ఆధారిత సంస్థాగత మార్పులు వేగవంతం
అయితే తరచూ జరుగుతున్న ఉద్యోగాల కోతలు, అనిశ్చితి వల్ల ఉద్యోగుల్లో ఉత్సాహం తగ్గిపోతుందని, దీర్ఘకాలంలో కంపెనీల ప్రతిష్ట దెబ్బతింటుందని పలువురు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, మెటా ప్రస్తుతం ఏఐ ఆధారిత సంస్థాగత మార్పులను వేగవంతం చేస్తోంది. నిర్వహణ ఖర్చులను తగ్గించడం, ఏఐపై పెట్టుబడులను పెంచడం, సంస్థ నిర్మాణాన్ని సరళీకృతం చేయడం లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 వేల ఉద్యోగాలను తగ్గిస్తోంది. మరోవైపు మిగిలిన వేలాది మంది ఉద్యోగులను AI ప్రాజెక్టులు, ఆటోమేషన్, జనరేటివ్ ఏఐ టూల్స్‌కు సంబంధించిన విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి కొంతకాలం పాటు జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు కొనసాగిస్తామని మెటా తెలిపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.