LinkedIn: ఏఐ ఎఫెక్ట్.. లింక్డ్‌ఇన్‌లో 600 మందికి పైగా ఉద్యోగాల కోత.. మెటాలోనూ భారీ తొలగింపులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ భారీగా ఉద్యోగులను తొలగించింది. కంపెనీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 600 మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు ఇచ్చినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. జూలై 13 నుంచి ఈ ఉద్యోగాల కోతలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. గత వారం 606 మంది ఉద్యోగులను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా తెలియజేసిందని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై భారీగా దృష్టి పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా లింక్డ్‌ఇన్‌లో 17,500 మందికి పైగా ఫుల్‌టైమ్ ఉద్యోగులు
టెక్ కంపెనీలు ఇప్పుడు ఏఐ టెక్నాలజీపై పెట్టుబడులు పెంచుతూ ఖర్చులను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఈ నెల ప్రారంభంలో రాయిటర్స్ కథనం ప్రకారం, లింక్డ్‌ఇన్ తన సంస్థలో సుమారు 5 శాతం ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించింది. కంపెనీలోని టీమ్‌లను పునర్వ్యవస్థీకరించడం, వ్యాపారం వృద్ధి చెందుతున్న విభాగాలపై ఎక్కువ దృష్టి పెట్టడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లింక్డ్‌ఇన్‌లో 17,500 మందికి పైగా ఫుల్‌టైమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.
వివరాలు
మౌంటెన్ వ్యూ కార్యాలయంలో 350 మందికి పైగా ఉద్యోగుల తొలగింపు
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న మౌంటెన్ వ్యూ కార్యాలయంలోనే అత్యధికంగా ఉద్యోగులపై ప్రభావం పడింది. అక్కడ 350 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. అలాగే కాలిఫోర్నియాలో రిమోట్‌గా పనిచేస్తున్న 66 మంది ఉద్యోగులను కూడా కంపెనీ తొలగించింది. శాన్ ఫ్రాన్సిస్కోలో 108 మంది, సన్నీవేల్‌లో 59 మంది, కార్పింటేరియాలో 21 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ లేఆఫ్‌లకు ముందు లింక్డ్‌ఇన్ సీఈఓ డేనియల్ షపెరో ఉద్యోగులకు అంతర్గత మెమో పంపినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించింది.
వివరాలు
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంజినీరింగ్, మార్కెటింగ్, ప్రొడక్ట్ విభాగాల్లో మార్పులు
కంపెనీ దీర్ఘకాల లక్ష్యాలను సాధించాలంటే కొత్త విధానాలతో వేగంగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంజినీరింగ్, మార్కెటింగ్, ప్రొడక్ట్ విభాగాల్లో మార్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు. అదే సమయంలో మార్కెటింగ్ ఖర్చులు, వెండర్ ఎక్స్‌పెన్సెస్, కస్టమర్ ఈవెంట్లు, ఆఫీస్ స్పేస్ ఖర్చులను కూడా లింక్డ్‌ఇన్ తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లింక్డ్‌ఇన్ మాతృసంస్థ మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగులకు బైఔట్ ఆఫర్లు ప్రకటించింది. దీని ప్రభావం సంస్థలోని సుమారు 8,750 మంది ఉద్యోగులపై పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.