Meta Fine: మెటాకు భారీ షాక్.. రూ.2.3 లక్షల కోట్ల జరిమానా విధించిన కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం మెటా (Meta)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యూజర్ల డేటా గోప్యత విషయంలో వినియోగదారులను తప్పుదారి పట్టించిందన్న ఆరోపణలపై అమెరికాలోని న్యూ మెక్సికో కోర్టు ఆ కంపెనీని దోషిగా తేల్చింది. ఈ కేసులో మెటాకు 25 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.3 లక్షల కోట్లు) జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని న్యూ మెక్సికో రాష్ట్రానికి చెల్లించాలని ఆదేశించింది. అమెరికా చరిత్రలో ఒక కంపెనీపై విధించిన భారీ జరిమానాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
వివరాలు
అసలు ఈ కేసు ఏంటి?
2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఫేస్‌బుక్ (ప్రస్తుతం మెటా)కు చెందిన మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా (Cambridge Analytica) అనే సంస్థ సేకరించిందనేది ప్రధాన ఆరోపణ.
బ్రిటన్‌కు చెందిన ఈ కన్సల్టింగ్ సంస్థ.. యూజర్ల అనుమతి లేకుండానే వారి డేటాను సేకరించి, రాజకీయ ప్రచారాల కోసం దుర్వినియోగం చేసిందని ఆరోపణలొచ్చాయి.
ఈ వ్యవహారం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ సంస్థకు చెందిన ఓ మాజీ ఉద్యోగి ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు బ్రెగ్జిట్ రిఫరెండంలోనూ కేంబ్రిడ్జ్ అనలిటికా జోక్యం చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి.
వివరాలు
2021లో మెటాపై దావా
అంతేకాకుండా భారత్, కెన్యా, నైజీరియా వంటి దేశాల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియల్లోనూ ఈ సంస్థ జోక్యం చేసుకుందని విమర్శలు వెల్లువెత్తాయి.
యూజర్ల డేటా ఉల్లంఘనలకు సంబంధించి న్యూ మెక్సికో అటార్నీ జనరల్ రౌల్ టోరెజ్ (Raul Torrez)2021లో మెటా, అంటే ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని సంస్థపై దావా వేశారు.
వినియోగదారుల సమాచారం ఎవరెవరికి చేరుతుందనే విషయంలో కంపెనీ నిజాలను దాచిపెట్టి, యూజర్లను తప్పుదారి పట్టించిందని ఆయన ఆరోపించారు.
ఈ కేసులో మెటాకు 219 బిలియన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందంటూ వార్తలు వెలువడ్డాయి.
అయితే న్యాయమూర్తి ఆ మొత్తాన్ని 25 బిలియన్ డాలర్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చారు. ఈ జరిమానా మొత్తాన్ని న్యూ మెక్సికో రాష్ట్రానికి చెల్లించాలని ఆదేశించారు.
వివరాలు
అప్పీల్‌కు వెళ్తామంటున్న మెటా
ఇదే కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా వివాదానికి సంబంధించి 2019లోనూ మెటాపై భారీ జరిమానా పడింది.
అప్పట్లో అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్(FTC)ఈ సంస్థకు 5 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. కోర్టు తీర్పుపై మెటా స్పందించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్తామని, అక్కడ విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని వెల్లడించింది.
ఈతీర్పు కారణంగా న్యూ మెక్సికో రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం మరింత క్లిష్టంగా మారుతుందని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం మెటా కంపెనీ మార్కెట్ విలువ సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా.
ఈ నేపథ్యంలో 25 బిలియన్ డాలర్ల జరిమానా భారీ మొత్తమే అయినప్పటికీ, కంపెనీ మొత్తం విలువపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.