Loading...
Finance influencer: ఆన్‌లైన్ వేధింపులు తట్టుకోలేక ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆత్మహత్య!
ఆన్‌లైన్ వేధింపులు తట్టుకోలేక ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆత్మహత్య!

Finance influencer: ఆన్‌లైన్ వేధింపులు తట్టుకోలేక ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆత్మహత్య!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2026
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

పుదుచ్చేరికి చెందిన ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ హరీష్ (Influencer Harish) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఓ టెక్‌ కంపెనీ సీఈఓ తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో 'ఫైనాన్స్ విత్ హరీష్' పేరుతో సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్న 27 ఏళ్ల హరీష్‌కు ఆన్‌లైన్‌లో 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మంగళవారం చెన్నైలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

వివరాలు

ఆత్మహత్యకు ముందు వీడియో.. ఏమన్నారంటే?

ఆర్థిక సలహాలు ఇచ్చేందుకు హరీష్‌కు ఉన్న అర్హతలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వివాదం నడుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అందులో ఆరోపించారు.

గత కొన్ని రోజులుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నానని, వాటిని తట్టుకోలేకే చనిపోవాలని నిర్ణయించుకున్నానని హరీష్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

వివరాలు

రూ.3 కోట్లు డిమాండ్ చేశారని తండ్రి ఆరోపణ

తన కుమారుడు ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపుల కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడని హరీష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంచర్ స్టూడియో 'జెమూరియా ఇంక్' సీఈఓ జాసన్ శామ్యూల్ (Tech CEO Jason Samuel) కొన్ని నెలలుగా తన కుమారుడిని వేధిస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ నాయకుల పేర్లను ఉపయోగించి హరీష్‌ను బెదిరించారని, రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

హరీష్ తన వీడియోల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడంటూ శామ్యూల్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేశారని ఆయన తండ్రి ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మెటా తన కుమారుడి ఖాతాను నిలిపివేసిందని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

ఆరోపణలను ఖండించిన సీఈఓ.. పోలీసుల దర్యాప్తు

దీంతో హరీష్ మరో ఖాతాను సృష్టించి వీడియోలు పోస్టు చేయడం ప్రారంభించాడని, ఆ ఖాతాను కూడా తొలగించడంతో తీవ్ర వేదనకు గురయ్యాడని ఫిర్యాదులో వివరించారు.

తన కుమారుడి మరణానికి కారణమైన సీఈఓకు తగిన శిక్ష విధించాలని హరీష్ తండ్రి డిమాండ్ చేశారు.

హరీష్ తండ్రి చేసిన ఆరోపణలను జాసన్ శామ్యూల్ ఖండించారు. మరోవైపు, ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇరు పక్షాల ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు.

ADVERTISEMENT