Sharwanand: రెండు హిట్లు వచ్చాయి.. 'భోగి'తో హ్యాట్రిక్ కొడతా: శర్వానంద్
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడలో నిర్వహించిన 'భోగి' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గతేడాది విజయదశమి రోజున తన చిన్నాన్నతో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో 10K రన్‌లో పాల్గొన్న సమయంలోనే మరుసటి ఏడాది తప్పకుండా వస్తానని చెప్పానని, ఈసారి మరింత ఘనంగా ఈ వేడుకల్లో భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో సంక్రాంతి పండగ అనగానే గోదావరి జిల్లాలు గుర్తుకొచ్చేవని, ఇప్పుడు విజయవాడ దసరా ఉత్సవాలు కూడా అంతటి ఖ్యాతిని సంపాదించుకున్నాయని శర్వానంద్ అన్నారు. ఈ వేడుకలను ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
వివరాలు
విజయవాడతో ప్రత్యేక అనుబంధం
విజయవాడ తన పుట్టినూరని, ఈ నగరంతో తనకు ఎంతో బలమైన భావోద్వేగ అనుబంధం ఉందని శర్వానంద్ వెల్లడించారు. వేసవి సెలవుల్లో తరచూ విజయవాడకు వస్తుండేవాడినని గుర్తుచేసుకున్నారు.
తన తాతగారు సిద్ధార్థ అకాడమీ వ్యవస్థాపకుడని, అక్కడి సిద్ధార్థ కాలేజీల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
'చిన్నప్పుడు ఇక్కడి రోడ్లపై గంటకు అర్ధ రూపాయి అద్దె చెల్లించి సైకిల్ తొక్కేవాడిని. ఆ మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తున్నాయని పాత రోజులను నెమరువేసుకున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ తనకు అండగా ఉంటాయని శర్వానంద్ అన్నారు.
ఆ తల్లి అనుగ్రహంతోనే ఈ ఏడాది తనకు రెండు విజయాలు దక్కాయని పేర్కొన్నారు.
వివరాలు
'భోగి'తో హ్యాట్రిక్ కొడతా!
విజయదశమి పర్వదినాన అమ్మవారి ఆశీస్సులతోనే కొత్త సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది ఇప్పటికే రెండు విజయాలను అందుకున్న తాను.. 'భోగి' సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తాననే నమ్మకం ఉందని శర్వానంద్ ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషనల్ సినిమాలు చేసిన తాను ఇంతటి భారీ కమర్షియల్ మాస్ చిత్రాన్ని చేయగలనా అనే సందేహం మొదట్లో తనకూ కలిగిందని వెల్లడించారు.
'ఎప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషనల్ సినిమాలు చేసే శర్వానంద్ ఇంత భారీ కమర్షియల్ మాస్ సినిమా చేయగలడా అనే అనుమానం మొదట్లో నాకూ ఉంది.
కానీ ఒక అద్భుతమైన కథతో ఈ సినిమాను రూపొందించామని ఆయన వివరించారు.
వివరాలు
అన్నాచెల్లెళ్ల అనుబంధంతో సాగే కథ
'భోగి' సినిమా ఒక అన్నాచెల్లెళ్ల కథ అని శర్వానంద్ తెలిపారు. మన జీవితాల్లో కుటుంబం, తల్లిదండ్రులు, స్నేహితులు, దైవంపై ఉండే నమ్మకమే మనకు ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు.
ఒకపక్క కృష్ణమ్మ నీరిస్తుందనే భరోసా, అమ్మవారి రక్షణ, వెన్నంటి నిలిచే కుటుంబం, అండగా ఉండే పేరెంట్స్, నడిపించే స్నేహితులు ఉంటారనే నమ్మకంతోనే మనమంతా బతుకుతాం.
ఆ నమ్మకాన్ని వమ్ముచేసి వెన్నుపోటు పొడిస్తే.. ఎక్కడున్నా వెతికి మరీ నాశనం చేసేవాడే ఈ కథలోని గంగ. ఆ గంగ కాస్తా పెనుగంగగా ఎలా మారాడన్నదే 'భోగి' అసలు కథ'' అని శర్వానంద్ సినిమా కథాంశాన్ని వివరించారు.
వివరాలు
నా కెరీర్‌లోనే అత్యంత వైలెంట్ సినిమా
తన కెరీర్‌లో ఇప్పటివరకు ఇంతటి వైలెంట్ సినిమాను ఎప్పుడూ చేయలేదని శర్వానంద్ పేర్కొన్నారు.
అయితే ఒక గొప్ప చిత్రాన్ని తెరకెక్కించానని గర్వంగా చెప్పుకోగలనని అన్నారు. ప్రేక్షకులను మెప్పించే సరికొత్త యాక్షన్ విందును సిద్ధం చేశామని వెల్లడించారు.
'భోగి' సినిమాను నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విజయవాడ ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.
సినిమా విడుదలైన తర్వాత విజయోత్సవ వేడుకను కూడా విజయవాడలోనే ఘనంగా నిర్వహించుకుందామని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.