Loading...
Stock Market: భారీ లాభాల నుంచి నష్టాల్లోకి.. సెన్సెక్స్‌ గరిష్ఠాల నుంచి 1000 పాయింట్లు పతనం!
భారీ లాభాల నుంచి నష్టాల్లోకి.. సెన్సెక్స్‌ గరిష్ఠాల నుంచి 1000 పాయింట్లు పతనం!

Stock Market: భారీ లాభాల నుంచి నష్టాల్లోకి.. సెన్సెక్స్‌ గరిష్ఠాల నుంచి 1000 పాయింట్లు పతనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2026
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market) తీవ్ర ఒడుదొడుకుల మధ్య చివరకు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో, మెటల్ రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. దీంతో ఉదయం భారీ లాభాల్లో కదలాడిన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 800 పాయింట్ల వరకు లాభపడింది. అయితే, ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో గరిష్ఠ స్థాయుల నుంచి సుమారు 1,300 పాయింట్లు పడిపోయి ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివర్లో కొంత కోలుకున్నప్పటికీ.. గరిష్ఠ స్థాయితో పోలిస్తే సుమారు 1,000 పాయింట్లు దిగువన ముగిసింది. దీంతో సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.

వివరాలు

నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

సెన్సెక్స్‌ గత ముగింపు 73,852.90తో పోలిస్తే.. ఉదయం 74,337.93 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఉదయం అంతా లాభాల్లోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 74,682.19 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.

అనంతరం అమ్మకాల ఒత్తిడితో క్రమంగా దిగజారుతూ 73,229.45 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది. చివర్లో కొంత కోలుకుని 143.21 పాయింట్ల నష్టంతో 73,709.69 వద్ద ముగిసింది.

నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనించింది. చివరకు 77.60 పాయింట్లు నష్టపోయి 22,811 వద్ద స్థిరపడింది. మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.45గా నమోదైంది.

వివరాలు

లాభనష్టాల్లో కీలక షేర్లు

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎటర్నల్‌, ట్రెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ షేర్లు నష్టాలను చవిచూశాయి.

మరోవైపు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభపడ్డాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 110 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర ఔన్సుకు 4,115 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ADVERTISEMENT

వివరాలు

స్టాక్‌ మార్కెట్‌ నష్టాలకు కారణాలివే..

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగి సూచీలు నష్టాల్లో ముగియడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపించాయి.

గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ: ఉదయం సూచీలు భారీ లాభాల్లోకి వెళ్లడంతో కొందరు ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు షేర్లను విక్రయించారు. దీంతో మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

క్రూడాయిల్‌ ధరల పెరుగుదల: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర మళ్లీ బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరడం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది.

ఇండియా VIXపెరుగుదల: మార్కెట్‌లో ఒడుదొడుకులకు సంబంధించిన సూచీ అయిన ఇండియా VIX సుమారు 7.5శాతం పెరిగింది.

ఇది ఇన్వెస్టర్లలో అనిశ్చితి పెరిగినట్లు సూచించింది. ఈ పరిణామాలతో రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి.

ADVERTISEMENT