Maruthi: భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన మారుతీ.. ఏకంగా 45వేల కోట్ల పెట్టుబడులు!
వార్షిక సాధారణ సమావేశంలో మారుతీ సుజుకీ కీలక నిర్ణయాలను తీసుకుంది. వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షిక తయారీ సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుతున్నట్లు ఇండియా ఛైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు. ఇందుకోసం రూ.45,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం జరిగిన వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. రాబోయే రోజుల్లో వివిధ రకాల ఇంధన ఆధారిత వాహనాలను తీసుకొస్తామని, విద్యుత్, హైబ్రిడ్, సీఎన్‌జీ, ఇథనాల్ సహా కంప్రెస్డ్ బయోగ్యాస్ తో నడిచే వాహనాలను తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో స్టాక్ విభజనపై వాటాదారుల సలహాలను స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
వివిధ రకాల ఇంధనాలతో నడిచే వాహనాల తయారీకి ప్రయత్నం
వచ్చే 8-10 సంవత్సరాల్లో సాంకేతికంగా రాబోతున్న మార్పులను అంచనా వేయడం కష్టమని, ఈ తరుణంలో వివిధ రకాల ఇంధనాలతో నడిచే వాహనాల తయారీకి ప్రయత్నించనున్నట్లు భార్గవ చెప్పారు. ఈ క్రమంలో 28 రకాల కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 40ఏళ్లలో కంపెనీ రెండు మిలియన్ల యూనిట్ల విక్రయాలను చేరుకుందని, వచ్చే ఎనిమిదేళ్లలో మరో రెండు మిలియన్ల లక్ష్యాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కంపెనీ షేర్ విలువ దాదాపు రూ.10వేలకు చేరిందని, ఈ నేపథ్యంలో స్టాక్ విభజన అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్తామని, ఇంకా ఆరు విద్యుత్ మోడళ్లను తీసుకొచ్చే యోచనలో ఉన్నామని వెల్లడించారు. ఇక కంపెనీ స్టాక్ మంగళవారం 0.39 శాతం పుంజుకొని రూ.9,634 దగ్గర స్థిరపడింది.