MediaTek: ఎన్‌విడియా రూ.3.5 బిలియన్ల పెట్టుబడి.. మీడియాటెక్ షేర్లకు భారీ డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా చిప్ దిగ్గజం నివిడియా (NVIDIA) భారీగా 3.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడంతో మీడియాటెక్ (MediaTek) షేర్లు మంగళవారం తైపీ ట్రేడింగ్‌లో ఏకంగా 10 శాతం పెరిగాయి. అమెరికా వెలుపల ఎన్‌విడియా నేరుగా చేసిన అతిపెద్ద పెట్టుబడి ఇదే కావడం విశేషం. ఈ ఒప్పందాన్ని సోమవారం ప్రకటించారు. మీడియాటెక్ చేపట్టిన మొత్తం 3.9 బిలియన్ డాలర్ల బాండ్ విక్రయంలో భాగంగా.. భవిష్యత్తులో మీడియాటెక్ షేర్లుగా మార్చుకునే వీలున్న బాండ్లను ఎన్‌విడియా కొనుగోలు చేయనుంది.
వివరాలు
ఏఐ చిప్ కంపెనీగా మారుతున్న మీడియాటెక్
గతంలో షియోమీ, ఒప్పో వంటి మొబైల్ ఫోన్ కంపెనీలకు చిప్‌లు సరఫరా చేసే విషయంలో క్వాల్‌కామ్‌తో పోటీ పడుతూ మీడియాటెక్ గుర్తింపు పొందింది.
అయితే ఇప్పుడు సంస్థ తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. సొంతంగా రూపొందించే ప్రత్యేక చిప్‌ల (కస్టమ్ సిలికాన్) తయారీపై దృష్టి పెడుతోంది.
ఈ మార్పుతో బ్రాడ్‌కామ్‌తోనూ మీడియాటెక్ పోటీ పడుతోంది. అంతేకాకుండా సొంత ఏఐ చిప్‌లను అభివృద్ధి చేసుకుంటున్న టెక్ దిగ్గజాలకు భాగస్వామిగా నిలుస్తోంది.
ఎన్‌విడియా పెట్టుబడిని ఈ వ్యూహాత్మక మార్పునకు లభించిన కీలక మద్దతుగా మార్కెట్ వర్గాలు చూస్తున్నాయి.
దీంతో మీడియాటెక్ ఏఐ సెమీకండక్టర్ కంపెనీగా మారుతున్న తీరు మరింత బలపడినట్లైంది.
వివరాలు
భారీ లక్ష్యాలు.. వరుసగా కీలక భాగస్వామ్యాలు
ఎన్‌విడియాతో ఒప్పందం తర్వాత తమ ఏఐ చిప్ వ్యాపారం మరింత వేగంగా వృద్ధి చెందుతుందని మీడియాటెక్ సీఈఓ రిక్ సాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలోనే కస్టమ్ ఏఐ సిలికాన్ వ్యాపారం 2027 నాటికి 2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మీడియాటెక్ అంచనా వేసింది.
సుమారు 80 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్న ఈ మార్కెట్‌లో 15 శాతం వాటాను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇటీవలి నెలల్లో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు మూడు రెట్లు పెరిగింది. గూగుల్‌తో కుదిరిన భాగస్వామ్యం దీనికి ఊతమిచ్చింది.
అంతేకాకుండా స్పేస్‌ఎక్స్ కూడా మీడియాటెక్‌కు తదుపరి ఏఐ చిప్ కస్టమర్‌గా మారొచ్చన్న అంచనాలు సంస్థకు మరింత కలిసొస్తున్నాయి.