LOADING...
₹6,000cr fraud: రూ.6 వేల కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలు.. వివో,ఒప్పో, షియోమీపై SFIO దర్యాప్తు  
వివో,ఒప్పో, షియోమీపై SFIO దర్యాప్తు

₹6,000cr fraud: రూ.6 వేల కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలు.. వివో,ఒప్పో, షియోమీపై SFIO దర్యాప్తు  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలైన వివో(Vivo),ఒప్పో(Oppo),షియోమీ(Xiaomi)పై రూ.6 వేల కోట్ల నిధుల మళ్లింపుపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (SFIO) దర్యాప్తు చేపట్టింది. కంపెనీల రిజిస్ట్రార్‌ (RoC)సమర్పించిన నివేదికలో ఈ నిధుల మళ్లింపు ఆరోపణలు ఉండటంతో, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) SFIOకి ఈ కేసు అప్పగించినట్లు ప్రభుత్వ వర్గాలు మని‌కంట్రోల్‌కు వెల్లడించాయి. వివోపై ఇప్పటికే SFIO దర్యాప్తు జరుపుతుండగా, షియోమీ,ఒప్పో కేసులనూ దీనికే అప్పగించినట్టు సమాచారం. "RoC నివేదికలో నిధుల మళ్లింపు అంశం ప్రస్తావన వచ్చింది.SFIO దర్యాప్తు పూర్తైన తర్వాత తుది నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పిస్తారు"అని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన దర్యాప్తు సుమారు ఏడాది పాటు కొనసాగనుందని మరో అధికారి వెల్లడించారు.

వివరాలు 

దర్యాప్తు పూర్తయ్యాక,SFIO.. మంత్రిత్వ శాఖకు నివేదికను అందజేస్తుంది

RoC నివేదిక ప్రకారం ఈ మూడు కంపెనీలు కలిపి దాదాపు రూ.6 వేల కోట్లను మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నివేదిక ఆధారంగానే SFIO ద్వారా సమగ్ర దర్యాప్తు జరపాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దర్యాప్తు పూర్తయ్యాక,SFIO తుది నివేదికను మంత్రిత్వ శాఖకు అందజేస్తుంది. అనంతరం ప్రత్యేక కోర్టులో ఈ కంపెనీలు,వారి డైరెక్టర్లు,సంబంధిత సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం మంత్రిత్వ శాఖకు ఉంటుంది. షియోమీ,వివో,ఒప్పోలకు సంబంధించి మని‌కంట్రోల్‌ పంపిన ఈమెయిల్స్‌కు ఇంకా స్పందన రాలేదు. వారి సమాధానాలు అందిన వెంటనే వివరాలు అప్‌డేట్‌ చేస్తామని తెలిపింది. నెలలపాటు పరిశీలించిన అనంతరం RoC తన నివేదికను తుది రూపంలో మంత్రిత్వ శాఖకు పంపింది.

వివరాలు 

నిధుల మళ్లింపుతో పాటు పన్ను ఎగవేత,సంబంధిత సంస్థలతో ఆర్థిక లావాదేవీలపై  దర్యాప్తు 

ఇందులో నిధుల మళ్లింపుతో పాటు పన్ను ఎగవేత,సంబంధిత సంస్థలతో ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు జరపాలని సిఫారసు చేసింది. పన్ను సంబంధిత అంశాలపై సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (CBDT),సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (CBIC)కి కూడా నివేదిక కాపీలు అందజేసింది. ఆరోపణల విస్తృత స్వరూపం,క్లిష్టత దృష్ట్యా MCA ఈ కేసును SFIOకి అప్పగించింది.

వివరాలు 

SFIO కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ

SFIO అనేది కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ. భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు,కార్పొరేట్‌ మోసాలపై ఇది దర్యాప్తు చేస్తుంది. సాధారణంగా RoC లేదా ఇతర నియంత్రణ సంస్థల నివేదికల ఆధారంగా కేంద్రం కేసులను దీనికి అప్పగిస్తుంది. SFIO దర్యాప్తులో కంపెనీ రికార్డులు,ఆర్థిక లావాదేవీలు,సంబంధిత పార్టీల ఒప్పందాలు సమగ్రంగా పరిశీలించడంతో పాటు డైరెక్టర్లు,కీలక నిర్వాహకులను విచారించడం కూడా ఉంటుంది.