Gig Workers Shutdown Strike: ఇవాళ గిగ్ వర్కర్స్ సమ్మె బాట.. నిలిచిపోనున్న స్విగ్గి, జొమాటో సహా ఆన్‌లైన్ డెలివరీ సేవలు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా పనిచేస్తున్న డెలివరీ భాగస్వాములు, రైడ్-హెయిలింగ్ డ్రైవర్లు, ఇతర యాప్ ఆధారిత కార్మికులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) సమ్మెకు సిద్ధమైంది. యూనియన్ పిలుపుతో నేడు (జనవరి 26, 2026) దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో భాగంగా గిగ్ కార్మికులు నిరసనగా తమ యాప్‌లను పూర్తిగా ఆఫ్ చేయనున్నారు. దీనికి కొనసాగింపుగా ఫిబ్రవరి 3న దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని యూనియన్ నిర్ణయించింది.
వివరాలు
ఈ ఉద్యమానికి మహిళా గిగ్ వర్కర్లు నాయకత్వం వహిస్తారు.
ఈ ఉద్యమానికి ప్రత్యేకతగా మహిళా గిగ్ కార్మికులే ముందుండి నాయకత్వం వహిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో మహిళా కార్మికులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారని GIPSWU జాతీయ అధ్యక్షురాలు సీమా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అనేక మంది మహిళా కార్మికులు తాము అందిస్తున్న సేవలకు తగిన జీతాలు పొందడం లేదని, శారీరక హింసను కూడా ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ ఘటనలపై కంపెనీలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రావడం లేదని, చివరికి కారణం చెప్పకుండా వారి IDలను బ్లాక్ చేసి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం స్పందించకుండా మౌనంగా ఉందని ఆమె విమర్శించారు.
వివరాలు
జొమాటో ప్రతి నెలా వేలాది మంది కార్మికులను తొలగిస్తోంది
జొమాటో వంటి సంస్థలు ప్రతి నెలా 5 వేల మందికి పైగా కార్మికులను తొలగిస్తున్నాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అర్బన్ కంపెనీకి చెందిన కార్మికులు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారని యూనియన్ పేర్కొంది. తమ సమస్యలను మీడియా ముందుకు తీసుకురావాలనుకున్నా, ఉద్యోగాలు పోతాయనే భయంతో చాలామంది ముఖాలను దాచుకొని మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపింది. కార్మికులను బలవంతంగా పని చేయించి, వారి గొంతులను అణిచివేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదా? అని యూనియన్ ప్రశ్నిస్తోంది. సీమా సింగ్ మాట్లాడుతూ, కార్మిక-ఉపాధి మంత్రిత్వ శాఖకు యూనియన్ ఇప్పటికే పలు మెమోరాండమ్‌లు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
వివరాలు
జొమాటో ప్రతి నెలా వేలాది మంది కార్మికులను తొలగిస్తోంది
ఇటీవల మంత్రి మన్సుఖ్ మాండవీయ 10 నిమిషాల తక్షణ డెలివరీ సేవలపై వ్యాఖ్యానించినా, దానికి సంబంధించిన రాతపూర్వక ఆదేశాలు గానీ, అధికారిక నోటిఫికేషన్ గానీ విడుదల కాలేదని గుర్తుచేశారు. ప్రభుత్వం మాటల వరకే పరిమితమవుతోందని, కానీ గిగ్ కార్మికుల అసలు సమస్యలైన ID బ్లాకింగ్, భద్రత, జీవనోపాధి దుస్థితి వంటి అంశాలపై మాత్రం పూర్తిగా మౌనం పాటిస్తోందని విమర్శించారు.
వివరాలు
గిగ్ కార్మికుల ప్రధాన ఫిర్యాదులు:
కారణం లేకుండా ఏకపక్షంగా IDలను బ్లాక్ చేయడం, అన్యాయమైన రేటింగ్ వ్యవస్థ ఆదాయం నిరంతరం తగ్గడం, కమిషన్లు పెరగడం, పారదర్శకత లేకపోవడం కస్టమర్ ఫిర్యాదులపై తమ వాదన వినిపించే అవకాశం కార్మికులకు ఇవ్వకపోవడం డబుల్ క్యాన్సిలేషన్ పెనాల్టీలు, టైమ్ క్యాప్, బండిల్డ్ బుకింగ్, ఆటో-అసైన్ వంటి విధానాలు మహిళా కార్మికులకు భద్రత లేకపోవడం, పీరియడ్స్ సమయంలో సెలవుల అవసరం, అత్యవసర 'రెడ్ బటన్' అమలు కొత్త విధానాలు లేదా మార్పులు అమలు చేసే ముందు కార్మికులతో సంప్రదింపులు జరపకపోవడం
వివరాలు
యూనియన్ ప్రధాన డిమాండ్లు:
గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా బలమైన కేంద్ర చట్టం తీసుకురావాలి ఏకపక్ష ID బ్లాకింగ్‌లు, అనుచిత రేటింగ్ విధానాలను వెంటనే నిలిపివేయాలి ఆదాయ రేట్లు పెంచి, కమిషన్ కోతలను నియంత్రించాలి మహిళా కార్మికులపై లైంగిక వేధింపులను నివారించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీల ఏర్పాటు పారదర్శకమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, కార్మికులకు అనుకూలమైన విధానాలు అమలు చేయాలి
వివరాలు
గిగ్ కార్మికులకు GIPSWU విజ్ఞప్తి:
జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ, ఓలా, ఉబర్ లేదా ఇతర ఏ ప్లాట్‌ఫామ్‌లో పనిచేస్తున్నా అన్ని గిగ్ కార్మికులు జనవరి 26న తమ యాప్‌లను మూసివేసి, ఫిబ్రవరి 3న రోడ్లపైకి రావాలని యూనియన్ పిలుపునిచ్చింది. ఎంపీలు, ఇతర ట్రేడ్ యూనియన్లు, మహిళా సంఘాలు, సాధారణ ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరింది. ఇది కేవలం ఒక యూనియన్ పోరాటం మాత్రమే కాదని, మొత్తం డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కార్మికుల గౌరవం, భద్రత కోసం సాగుతున్న ఉద్యమం అని స్పష్టం చేసింది. డిమాండ్లు నెరవేరకపోతే దేశవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున నిరసనలు తప్పవని హెచ్చరించింది.