Loading...
New Zealand -India trade deal: భారత్‌తో న్యూజిలాండ్‌ భారీ వాణిజ్య ఒప్పందం.. 95% ఎగుమతులపై సుంకాల తగ్గింపు
95% ఎగుమతులపై సుంకాల తగ్గింపు

New Zealand -India trade deal: భారత్‌తో న్యూజిలాండ్‌ భారీ వాణిజ్య ఒప్పందం.. 95% ఎగుమతులపై సుంకాల తగ్గింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమలుకు అవసరమైన బిల్లుకు న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 93 మంది ఎంపీలు ఓటు వేయగా.. 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే న్యూజిలాండ్‌ నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో 57 శాతంపై సుంకాలు ఉండవు. ఒప్పందం పూర్తిస్థాయిలో అమలైతే.. మొత్తం ఎగుమతుల్లో 95 శాతం ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా తొలగిపోవడం లేదా గణనీయంగా తగ్గడం జరుగుతుంది. దీంతో భారత మార్కెట్‌లో న్యూజిలాండ్‌ ఉత్పత్తులకు మరింత విస్తృత అవకాశాలు లభించనున్నాయి.

వివరాలు 

కివీ పరిశ్రమకు 125 మిలియన్‌ న్యూజిలాండ్‌ డాలర్ల వరకు ఆదా

కివీ పండ్ల పరిశ్రమకు ఈ ఒప్పందం గణనీయమైన ప్రయోజనం చేకూర్చనుంది.

రానున్న ఐదేళ్లలో సుంకాల రూపంలో సుమారు 125 మిలియన్‌ న్యూజిలాండ్‌ డాలర్లు ఆదా అవుతాయని అంచనా.

అంతేకాకుండా.. సరిహద్దుల్లో సరకు తనిఖీలు, క్లియరెన్స్‌ ప్రక్రియలు వేగవంతం కానున్నాయి.

భారత్‌లో విస్తరిస్తున్న మధ్యతరగతి న్యూజిలాండ్‌ ఎగుమతిదారులకు పెద్ద మార్కెట్‌గా మారుతోందని ఆ దేశ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్‌ మెక్లే తెలిపారు.

ఆహారం, సాంకేతికత, విద్య, పర్యాటకం, ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ రంగాల్లో భారత్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను న్యూజిలాండ్‌ కంపెనీలు సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

వివరాలు 

ఆమోద ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఎఫ్‌టీఏ అమల్లోకి..

ఇరు దేశాల్లోనూ ఆమోద ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఎఫ్‌టీఏ అమల్లోకి రానుంది.

ఈ ఏడాది చివరినాటికే ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మెక్లే వెల్లడించారు.

2030 నాటికి భారత్‌-న్యూజిలాండ్‌ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సాధించడంలో ఈ ఒప్పందం కీలకంగా మారుతుందని తెలిపారు.

మరోవైపు.. వెస్ట్‌పాక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బ్యాంక్‌ ఇటీవల విడుదల చేసిన నివేదికలోనూ భారత్‌ వృద్ధి అవకాశాలను ప్రస్తావించింది.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా వచ్చే పదేళ్లలో న్యూజిలాండ్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి దాదాపు 0.1 శాతం అదనపు వృద్ధి లభించే అవకాశం ఉందని అంచనా వేసింది.

ADVERTISEMENT