Narayana Murthy: ఉచితాలు కాదు,ఉద్యోగాల కల్పనతోనే పేదరిక నిర్మూలన.. ఇన్ఫీ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉచిత పథకాల కంటే ఉద్యోగాల కల్పన ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు.
ఔత్సాహిక వ్యాపారవేత్తలు వినూత్న వ్యాపారాలు ప్రారంభించి, ఉద్యోగ అవకాశాలను పెంచితే పేదరికం వేగంగా తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
టైకాన్ ముంబై 2025 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలను వివరించారు.
ఎంట్రప్రెన్యూర్లను ఉద్దేశించి మాట్లాడుతూ,"మీలో ప్రతి ఒక్కరూ వందలాది,వేలాది ఉద్యోగాలు సృష్టించగలరు.ఈ విధంగా మాత్రమే పేదరికాన్ని పూర్తిగా తగ్గించగలం.ప్రపంచంలో ఏ దేశమూ ఉచిత పథకాల ద్వారా పేదరికాన్నినిర్మూలించలేకపోయింది"అని మూర్తి స్పష్టం చేశారు.
కొన్నిసార్లు ఉచిత ప్రయోజనాలు అవసరమైనా, వాటికి బదులుగా ప్రజల జీవితాల్లో ఏమైనా ప్రత్యక్ష మార్పు వస్తుందా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వివరాలు
నాకు రాజకీయాలు లేదా పాలనలో ప్రాథమిక అవగాహన లేదు: నారాయణ మూర్తి
ఉదాహరణకు, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించాక, ఆరు నెలల తర్వాత పిల్లలు చదువులో మెరుగవుతున్నారా? తల్లిదండ్రుల ఆసక్తి పెరుగుతోందా? వంటి అంశాలపై ప్రభుత్వం ఓ సర్వే నిర్వహించడం ద్వారా పథకాలు నిజంగా ఉపయోగపడుతున్నాయా అనేది అంచనా వేయవచ్చని మూర్తి సూచించారు.
అంతేకాక, తనకు రాజకీయాలు లేదా పాలనలో ప్రాథమిక అవగాహన లేదని, కేవలం దేశ అభివృద్ధికి తోడ్పడే విధానపరమైన చర్యల గురించి మాత్రమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని మూర్తి స్పష్టంచేశారు.