Oracle Layoffs: ఒరాకిల్‌లో మరోసారి భారీ లేఆఫ్‌లు.. ఏఐ ఖర్చులను పూడ్చుకునేందుకేనా?
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (AI) వినియోగం పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాలపై ప్రభావం కొనసాగుతోంది. ఇప్పటికే ఏఐ కారణంగా పలు సంస్థలు సిబ్బందిని తగ్గించగా.. ఇప్పుడు ఏఐ కోసం చేస్తున్న భారీ పెట్టుబడుల భారాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు లేఆఫ్‌ల వైపు చూస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలను ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఏఐ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఒరాకిల్ భారీగా ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా డేటా సెంటర్ల నిర్మాణం, ఏఐ చిప్‌ల కొనుగోలు, ఓపెన్‌ఏఐ వంటి ఏఐ క్లయింట్లకు అవసరమైన మద్దతు అందించేందుకు సంస్థ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది.
వివరాలు
రెండంకెల శాతంలో సిబ్బంది తగ్గింపు
ఈ వ్యయాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం.
అయితే ఎంతమంది ఉద్యోగులపై వేటు పడనుందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
సెప్టెంబర్ 1న రెండో త్రైమాసికం ప్రారంభమయ్యేలోపే ఈ ఉద్యోగాల కోతలను అమలు చేయాలని ఒరాకిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొన్ని విభాగాల్లో సిబ్బంది తగ్గింపు రెండంకెల శాతంలో ఉండే అవకాశం ఉందని సమాచారం.
వివరాలు
గతంలోనూ భారీగా ఉద్యోగాల కోతలు
ఒరాకిల్‌కు లేఆఫ్‌లు కొత్తేమీ కాదు. గతంలోనూ సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగులను తగ్గించింది.
12 నెలల వ్యవధిలో సుమారు 21 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ఒరాకిల్ జూన్‌లో సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేధను విస్తృతంగా ఉపయోగించడంలో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందని సంస్థ అప్పట్లో తెలిపింది.
అంతేకాదు.. రానున్న కాలంలోనూ ఇలాంటి ఉద్యోగాల కోతలు కొనసాగవచ్చని స్పష్టం చేసింది.
దీంతో ఏఐపై పెరుగుతున్న పెట్టుబడుల ప్రభావం సంస్థ ఉద్యోగులపై మరోసారి పడే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.