Loading...
Google: ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు.. గూగుల్ సీఈవోకు 4,500 మంది ఉద్యోగుల వినతి
ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు.. గూగుల్ సీఈవోకు 4,500 మంది ఉద్యోగుల వినతి

Google: ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు.. గూగుల్ సీఈవోకు 4,500 మంది ఉద్యోగుల వినతి

వ్రాసిన వారు Moogati Shabari
Jul 17, 2026
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణ నేపథ్యంలో ఉద్యోగాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న గూగుల్ ఉద్యోగులు సంస్థ యాజమాన్యానికి పిటిషన్ సమర్పించారు. ఉద్యోగుల తొలగింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌కు ఇప్పటికే 4,500 మందికి పైగా గూగుల్ ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో చేపట్టిన ఈ పిటిషన్‌లో, ఉద్యోగులను తప్పనిసరిగా తొలగించే ముందు అన్ని ప్రొడక్ట్ విభాగాల్లో స్వచ్ఛంద బైఔట్ అవకాశాలు కల్పించాలని, హామీతో కూడిన సెవరెన్స్ ప్యాకేజీలు ఇవ్వాలని, అలాగే సెవరెన్స్ ప్రయోజనాలను పొడిగించిన వేతనంతో కూడిన సెలవుల రూపంలో తీసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

వివరాలు

రేటింగ్ వ్యవస్థను రద్దు చేయాలని పిటిషన్‌..

ఉద్యోగ భద్రతతో పాటు, ప్రస్తుతం అమల్లో ఉన్న పనితీరు (పర్‌ఫార్మెన్స్) రేటింగ్ వ్యవస్థను కూడా రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.

ఈ రేటింగ్‌లు ఉద్యోగుల ప్రతిభ ఆధారంగా కాకుండా, నిర్దేశించిన కోటాలను చేరుకోవడంపైనే ఆధారపడి ఇస్తున్నారని యూనియన్ సభ్యులు ఆరోపించారు.

"ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుతం ఈ సంస్థ అపూర్వమైన విజయాలను సాధిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల కోతలు, వ్యయ నియంత్రణ చర్యలు అనివార్యమైన నిర్ణయాలు కావు.

కంపెనీని ముందుకు నడిపిస్తున్న ఉద్యోగుల కంటే లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే దానికి ఇవే నిదర్శనం" అని గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు పరుల్ కౌల్ వ్యాఖ్యానించారు.

వివరాలు

ఉద్యోగుల నుంచి అతి పెద్ద ఫీడ్ బ్యాక్..

పిటిషన్‌ను సమర్పించిన తర్వాత కూడా గూగుల్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పరుల్ కౌల్ తెలిపారు.

సీఈవో సుందర్ పిచాయ్ కార్యాలయానికి వెళ్లిన ఉద్యోగులకు ఎక్కువగా మూసివేసిన తలుపులే కనిపించాయని, చివరకు అక్కడి సిబ్బందిలో ఒకరికి పిటిషన్‌ను అందించగా, దాన్ని సీఈవోకు చేరవేస్తామని వారు హామీ ఇచ్చారని చెప్పారు.

"ఉద్యోగ భద్రత అంశంపై గూగుల్ ఇప్పటివరకు ఉద్యోగుల నుంచి అందుకున్న అతిపెద్ద ఫీడ్‌బ్యాక్ ఇదే" అని పరుల్ కౌల్ పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

AI కారణంగా ఉద్యోగాల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన..

ఇక విలేకరుల సమావేశంలో పలువురు ఉద్యోగులు AI కారణంగా తమ ఉద్యోగాల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

"గూగుల్... గూగుల్... మీరు దాచలేరు... మీ అత్యాశను మేము చూస్తున్నాం" అంటూ నినాదాలు చేశారు.

డిజైనర్ల కోసం AI టూల్స్‌పై పనిచేస్తున్న గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ సభ్యుడు డాన్ ఫ్రీడ్‌మన్ కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేశారు.

తన ఉద్యోగ బాధ్యతల్లో AIను చేర్చిన తర్వాత కూడా అది సరిపోదేమోనన్న భయం కలుగుతోందని, భవిష్యత్తులో AI తన ఉద్యోగాన్నే భర్తీ చేసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT