Vijay Shekhar Sharma: యూపీఐ ఛార్జీల నిర్ణయం మంచిదే.. పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (Merchant Discount Rate) ఛార్జీలు విధించే నిర్ణయాన్నిపేటియం వ్యవస్థాపకుడు,సీఈఓ విజయ్ శేఖర్ శర్మ స్వాగతించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని సామాన్యులు,చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే 'రాబిన్ హుడ్' విధానంగా ఆయన అభివర్ణించారు. రూ.2,000కు మించిన కొన్ని నిర్దిష్ట యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీ విధించాలని ఎన్‌పీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర డిజిటల్ చెల్లింపు వ్యవస్థలకు చాలా కాలంగా ఛార్జీలు అమల్లో ఉన్నాయని విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఇప్పటివరకు యూపీఐ వ్యవస్థ ఎక్కువగా ప్రభుత్వ సహాయంతోనే కొనసాగుతోందని పేర్కొన్నారు.
వివరాలు
ముందే ఊహించ: విజయ్ శేఖర్ శర్మ
పెద్ద ఇ-కామర్స్ సంస్థలు, భారీ రిటైల్ చైన్‌లు నిర్వహించే అధిక విలువైన లావాదేవీలపై ఛార్జీలు విధించడం ద్వారా వచ్చే ఆదాయం.. సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలను భవిష్యత్తులోనూ ఉచితంగా అందించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు.
ఈ నిర్ణయం యూపీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏదో ఒక దశలో యూపీఐ లావాదేవీలపై రుసుము అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ముందే ఊహించినట్లు చెప్పారు.
అయితే, చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేలా ఛార్జీలపై నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.
వివరాలు
పేటీఎం షేర్లకు లాభాలు
యూపీఐపై ఎండీఆర్ ఛార్జీల ప్రకటన నేపథ్యంలో పేటీఎంతో పాటు పలు ఫిన్‌టెక్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.
పేటీయం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేరు ఇంట్రాడేలో గరిష్ఠంగా 7.24 శాతం పెరిగి రూ.1,856.50 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
వన్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ షేరు 5.96 శాతం, పైన్‌ల్యాబ్స్ షేరు 2.68 శాతం చొప్పున లాభపడ్డాయి.
అయితే, ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో పేటీఎం షేరు లాభాలు కొంత పరిమితమయ్యాయి. మరోవైపు, మొబిక్విక్, పైన్‌ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.