Perplexity IPO: ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ ప్రభావం లేదు.. 2028లోనే ఐపీఓకు పర్‌ప్లెక్సిటీ!
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ సంస్థ పర్‌ప్లెక్సిటీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఇటీవల ఆంత్రోపిక్, ఓపెన్‌ఏఐ సంస్థలు ఐపీఓ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, తాము ముందే నిర్ణయించుకున్నట్లుగా 2028లోనే స్టాక్ మార్కెట్లోకి రావాలని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ తెలిపారు. ఈ రెండు సంస్థల నిర్ణయాలతో తమ ప్రణాళికలకు ఎలాంటి సంబంధం లేదని, 2028 లక్ష్యాన్ని కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు.
వివరాలు
స్పేస్‌ఎక్స్ ఐపీఓ ప్రభావం ఉండొచ్చు
ఇదే సందర్భంగా స్పేస్-X ఐపీఓపై కూడా అరవింద్ శ్రీనివాస్ స్పందించారు. స్పేస్‌ఎక్స్ మార్కెట్ అరంగేట్రం విజయవంతమైతే లేదా విఫలమైతే, దాని ప్రభావం ఇతర AI కంపెనీల ఐపీఓలపై కూడా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆంత్రోపిక్, ఓపెన్‌ఏఐ వంటి సంస్థలు మార్కెట్లోకి వచ్చే సమయంలో స్పేస్‌ఎక్స్ ఐపీఓ ఒక సూచికగా పనిచేయొచ్చని చెప్పారు. అయితే, AI రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ రెండు కంపెనీల ఐపీఓలు విజయవంతం కావడం పరిశ్రమకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.
వివరాలు
ఆర్థిక ఇబ్బందులు లేవన్న పర్‌ప్లెక్సిటీ
పర్‌ప్లెక్సిటీ ఆర్థిక పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలను కూడా అరవింద్ శ్రీనివాస్ కొట్టిపారేశారు. కంపెనీ వద్ద తగిన నిధులు ఉన్నాయని, ఐపీఓ కోసం 2028 వరకు సౌకర్యంగా వేచి ఉండగల స్థితిలో ఉన్నామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో తొందరపడి మార్కెట్లోకి రావాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. పర్‌ప్లెక్సిటీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ దిమిత్రీ షెవెలెంకో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2028ను కనీస ఐపీఓ లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల కంపెనీ ఆరోగ్యకరమైన వ్యాపార వృద్ధిని సాధించగలిగిందని, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగడం తమకు ప్రయోజనకరంగా మారిందని తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న AI మార్కెట్లో పటిష్టమైన వ్యాపార నమూనాతో సంస్థ ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.