Qualcomm: క్వాల్‌కామ్‌లో లేఆఫ్స్ కలకలం.. ఉద్యోగులకు పరిహార ప్యాకేజీలు, లీగల్ క్లెయిమ్‌లపై హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ చిప్‌మేకర్, టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల కోతకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా భారత్‌తో పాటు అమెరికాలోని కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఏటా నిర్వహించే ఉద్యోగుల పనితీరు మదింపు ఆధారంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు కంపెనీ సీఈఓ క్రిస్టియానో అమన్ గతంలోనే అంతర్గత మెమో ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి అందించే పరిహార ప్యాకేజీలు, ఇతర ప్రయోజనాలపై టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వివరాలు
పనితీరు ఆధారంగానే ఉద్యోగుల కోత..
ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల తొలగింపులు పూర్తిగా పనితీరు ఆధారిత పునర్వ్యవస్థీకరణలో భాగమేనని కంపెనీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఏఐ ఆటోమేషన్ కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంటున్నాయి.
వ్యాపార ప్రాధాన్యతలు, ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ప్రమాణాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు స్మార్ట్‌ఫోన్ చిప్ మార్కెట్‌లో మందగమనం, మెమొరీ ధరలు పెరగడం, విక్రయాల అంచనాల్లో మార్పులు కంపెనీ వ్యూహాలపై ప్రభావం చూపుతున్నాయి.
ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్వాల్‌కామ్ తన వ్యాపార ప్రణాళికలను మార్చుకుంటోంది.
ఆటోమోటివ్ చిప్స్, డేటా సెంటర్లు వంటి కొత్త రంగాలపై దృష్టి సారిస్తూ సంస్థాగత మార్పులు చేపడుతోంది.
వివరాలు
ఉద్యోగులకు అందే పరిహార ప్యాకేజీలు..
ఉద్యోగాలు కోల్పోతున్న సిబ్బందికి కంపెనీ నిబంధనల ప్రకారం సెవరెన్స్ ప్యాకేజీలు అందిస్తోంది.
ఉద్యోగి క్వాల్‌కామ్‌లో పనిచేసిన సంవత్సరాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని,దానికి అదనంగా బేసిక్ వేతనాన్ని కలిపి పరిహార మొత్తాన్ని లెక్కిస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా మూడు నెలల జీతానికి సమానమైన ప్యాకేజీ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే కొన్ని విభాగాల్లో ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను బట్టి పరిహారం మారుతోంది.
పనిచేసిన ప్రతి ఏడాదికి రెండు వారాల గ్రాస్ శాలరీతో పాటు అదనపు ప్రయోజనాలు అందిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
త్వరగా అంగీకరిస్తే మరో నెల జీతం..
సెవరెన్స్ ఒప్పంద పత్రాలపై నిర్ణీత గడువులోగా సంతకం చేసే ఉద్యోగులకు కంపెనీ అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది.
నోటీసులు అందుకున్న రెండు లేదా మూడు రోజుల్లోనే డాక్యుమెంట్లపై సంతకం చేసిన వారికి మరో నెల జీతాన్ని అదనపు ప్రయోజనంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగం కోల్పోయిన వారికి కొంతకాలం పాటు హెల్త్ కవరేజ్ కొనసాగేలా ఆర్థిక సాయం, కెరీర్ ట్రాన్సిషన్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు కూడా ప్యాకేజీలో ఉన్నట్లు సమాచారం.
కొత్త ఉద్యోగం వెతుక్కునే సమయంలో ఇవి కొంతవరకు ఉపయోగపడనున్నాయి.
వివరాలు
లీగల్ క్లెయిమ్‌లపై నిబంధనలు..
అయితే సెవరెన్స్ ఒప్పందాలపై సంతకం చేసే ముందు ఉద్యోగులు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఒప్పందాల్లో భవిష్యత్తులో కంపెనీపై ఎలాంటి న్యాయపరమైన క్లెయిమ్‌లు చేయకూడదనే నిబంధనలు కూడా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
అందువల్ల ఒప్పందంలోని షరతులను పూర్తిగా చదివిన తర్వాతే సంతకం చేయాలని సూచిస్తున్నారు.
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పునర్వ్యవస్థీకరణ ఖర్చుల కోసం క్వాల్‌కామ్ భారీ మొత్తంలో నిధులు కేటాయించినట్లు వార్షిక నివేదికలు వెల్లడిస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నెలకొన్న ఒత్తిళ్లను అధిగమిస్తూ సంస్థను మరింత పటిష్టంగా నడిపించేందుకు యాజమాన్యం ఈ మార్పులు చేపడుతోంది.
కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ టెక్నాలజీ రంగంలో చర్చనీయాంశంగా మారాయి.